సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లో ఆగమాగం, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రాత్రి పూట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ పోలీసులు తనను వేధిస్తున్నారని అడుగడుగునా ఇబ్బందులు పెట్టి తనని క్షోభకి గురి చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

పోలీసులు తనను వేధిస్తున్నారని కేసీఆర్ కను సైగల్లోనే పోలీసులు పని చేస్తున్నారన్నారు. తన ఇళ్ల పై దాడులు చేస్తున్నారని, తన ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ఎన్ని కోట్లు పంచిండో పోలీసోళ్లకు తెలియాదా అని ఒంటేరు  ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్ కు చంచాలు గా పని చేస్తున్నారని తనను పగబట్టి వేదిస్తున్నారన్నారు. కావాలనే తన ఇళ్ల పై, అనుచరుల ఇళ్ల పై దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్ నీకు దమ్ముంటే ముందుకు వచ్చి ప్రజా క్షేత్రంలో పోరాడు కానీ నీ అధికార మదం చూపిస్తే పారిపోయే వాళ్లు ఎవరు లేరంటూ ఒంటేరు హెచ్చరించారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్ రిటర్నింగ్ ఆఫీసు ముందు దీక్ష చేస్తున్న ఒంటేరును పోలీసులు అరెస్టు చేశారు. అతనిని అదుపులో తీసుకునే సమయంలో పోలీసులు ఘోరంగా ప్రవర్తించారు. ఒక క్రిమినల్ ని తీసుకెళ్లి నట్టు ఈడ్చుకెళ్లారు. ఆయనతో చాలా అవమానకరంగా ప్రవర్తించారని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు. ఎన్నికల్లో పోటి చేస్తున్న వ్యక్తి పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని వారు ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం ఏలుతుందన్నారు. కేసీఆర్ ఏ పోలీసులను చూసుకొని దుర్మార్గ పాలన సాగిస్తున్నారో అదే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేసే రోజు వస్తుందని..బిడ్డా కేసీఆర్ గుర్తుంచుకో అంటూ వారు హెచ్చరించారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఒంటేరును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఒంటేరు అరెస్టు వార్త తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్టేషన్ కు, ఆస్పత్రికి చేరుకున్నారు.

 కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరకోవడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. అదనపు బలగాలను తెప్పించి బందోబస్తును నిర్వహిస్తున్నారు. గజ్వేల్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒంటేరు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మహా కూటమి నేతలు ఖండించారు. సోమవారం ఉదయం మహాకూటమి నేతలు గజ్వేల్ కు చేరుకొని ఒంటేరుని పరామర్శించి పరిస్థితి తెలుసుకోనున్నట్టగా తెలుస్తోంది.  ఒంటేరును  అరెస్టు  చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.