తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో పాటు పలు జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల.. తెలంగాణలో పెట్టబోయే తన కొత్త పార్టీ విధివిధానాలు ఏ రకంగా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. సన్నిహితులతో తెలంగాణ సమస్యలపై, పాలనపైన అవగాహన ఉన్న వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోటస్పాండ్లో షర్మిలతో తెలంగాణ రెడ్డి సంఘం నేతల భేటీ అయ్యారు.
షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘షర్మిల’ పెట్టబోతున్న పార్టీకి తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని ‘రెడ్లను’ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందని, ప్రాధాన్యత తగ్గిపోయిందని మండిపడ్డారు. రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్… ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. షర్మిల పార్టీతో తెలంగాణలో రెడ్లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. షర్మిలకు రాష్ట్రంలోని రెడ్లంతా మద్దతు పలుకుతారని చెప్పారు.
ఇదిలా ఉంటే షర్మిల తన కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన మే లేదా జులై లో ఉండొచ్చని తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 14, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక జూలై 8 ఆయన జయంతి. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన వైఎస్ షర్మిల తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కేవలం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్, పేరు మీద మాత్రమే రాజకీయాలు చేయాలని షర్మిల భావిస్తున్నారట.