Y.S.Sharmila: సూపర్ సిక్స్… సూపర్ ఫ్లాప్… అంతా 3డీ గ్రాఫిక్స్.. బాబు ఏడాది పాలనపై షర్మిల సెటైర్స్!

Y.S Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు ఏడాది పాలన ప్రతి ప్రస్థాయిలో విమర్శలు కురిపించారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతోంది. ఈ ఏడాది పాలన గురించి ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా షర్మిల చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది ఇప్పటివరకు ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయకుండా సూపర్ ఫ్లాప్ చేశారు అంటూ ఎద్దేవా చేశారు.

ఏడాది కాలం పాటు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది అంటూ డిమాండ్ చేశారు.బాబు ఏడాది పాలన అంతా మళ్లీ 3డీ గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్న ఇప్పటికీ ఒక్క హామీని నెరవేర్చకపోవడం విడ్డూరం అని తెలిపారు. 3 వేల నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? ఎంతమందికి భృతి ఇచ్చారు?’ అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని.. రైతులను ఆదుకునేది తామేనని చెప్పి ఏడాదిలో అన్నదాత సుఖీభవ ఒక రైతు కైనా అమలు చేశారా? రైతులకు అండగా ఉంటామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చి మోసం చేశారు. చదువుకునే ప్రతిబిడ్డకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అప్పుడే ఒక ఏడాది పూర్తి అయిపోయింది, తిరిగి స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఇప్పటివరకు ఒకరికి కూడా 15000 రూపాయలు వేయలేదని అలాగే మహిళా శక్తి కింద ప్రతి మహిళకు నెలకు 1500 సంవత్సరానికి 18000 చొప్పున ఇస్తామని చెప్పారు.మరి మహిళ శక్తి పథకం గురించి చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ మరొక పథకాన్ని ప్రకటించారు. ఏడాదికి మూడు సిలిండర్లని చెప్పి ఒకటి నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణమని హామీ ఇచ్చారు మరి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటానికి మీకెందుకు మనసు రాలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరెంట్ ఛార్జీలు రెండుసార్లు పెంచి రూ.17 వేల కోట్ల భారం వేశారు. చంద్రబాబు ఏడాది పాలన మొత్తం 3డీ గ్రాఫిక్స్’ అని విమర్శించారు. మీకు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.