తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. పలు కీలక నిర్ణయాలను తీసుకొని పాలనలో వేగవంతం చేశారు. ప్రస్తుతం అన్ని శాఖలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ పలు శాఖలను సమీక్షిస్తున్నారు. త్వరలోనే కేబినేట్ విస్తరణ జరగనున్నది. ప్రస్తుతానికైతే అన్ని శాఖలను కేసీఆరే నిర్వహిస్తున్నారు. దీంతో పలు శాఖల అధికారులతో ఆయన నిత్యం చర్చిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అందరి చేత ప్రశంసించేదిగా ఉంది.

ప్రస్తుతం చట్టాలు, పాలన నిబంధనలు ఇంగ్లీషులో ఉన్నాయి. అయితే వాటిని అందరికి అర్థం అయ్యే రీతిలో మాతృభాష అయిన తెలుగులోకి తేవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే దీని పై అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. గతంలో జరిగిన తెలుగు మహాసభల్లోనే కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. చట్టాలను మరియు పరిపాలన పరమైన నిబంధనలను, సచివాలయ నిబంధనలను తెలుగులోకి తేస్తామని దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాల పై అవగాహన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ లకు అప్పగించారు.

ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ పరిపాలన మరియు సచివాలయ నిబంధనలను తెలుగులోకి మార్చినట్టు తెలుస్తోంది. దీని ద్వారా అందరు ఎమ్మెల్యేలకు అవగాహన వస్తుంది. అలాగే ప్రజలకు కూడా శాసన సభ వ్యవహారాలు, నిబంధనలు మరియు చట్టాల గురించి తెలుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే మార్చిన చట్టాలను, నియమావళిని సీఎం కేసీఆర్ కు చూపించారు. కేసీఆర్ దానికి ఆమోదం తెలుపగానే వెబ్ సైట్ లో తెలుగులో పొందుపరుచనున్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పూర్తిగా తెలుగులోనే తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది.

ప్రభుత్వ నియమ నిబంధనలను తెలుగులోకి తేవడం ద్వారా ప్రజలకు తమ హక్కుల గురించి తెలియడమే కాకుండా పరిపాలన విధానాలు కూడా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని ఇంగ్లీషులో ఉండడం వల్ల అందరికి ఏం తెలియడం లేదు. చాలా మందికి అవగాహన లేక ప్రభుత్వం చేసే పనులను కూడా కొన్ని సార్లు పట్టించుకోవడం లేదు. ఎంతో శ్రమతో చేసినా ప్రజలు పట్టించుకోకపోవడం బాధాకరమని పలుసార్లు కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీంతో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు భాషలోకి అనువదించాలని కేసీఆర్ అదికారులను ఆదేశించారు.