కేసీఆర్, కేటీఆర్ మీద పోటీ చేసేది ఎవరో తెలుసా?

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా  తమతమ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. హేమ హేమిలపై ఉద్దండులనే బరిలోకి దించేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.

సీఎం కేసీఆర్ పోటి చేసే గజ్వేల్ లో ప్రజా యుద్దనౌక, కవి,గాయకుడు గద్దర్, మంత్రి కేటిఆర్ పై ప్రజా గాయకురాలు విమలక్క పోటిచేయనున్నారు. ఈ విషయాన్ని టిమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం గద్దర్, విమలక్క ఎన్నో త్యాగాలు చేశారని ఐలయ్య అన్నారు.

గద్దర్

గద్దర్ రాష్ట్రం కోసం పోరాడుతుంటే అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని ఆయనకు 6 బుల్లెట్ లు తగిలాయని, విమలక్క కాలుకు గజ్జె కట్టి రాష్ట్రం కోసం ఆడిపాడారన్నారు. తెలంగాణకు నిజమైన వారసులు గద్దర్, విమలక్కే అని ఐలయ్య తెలిపారు.

ఏ త్యాగం చేయని కేటిఆర్ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు ఇతర పార్టీలు ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. వారి పై పోటి పెట్టకుండా కాంగ్రెస్, బిజెపి ఇతర పార్టీల వారు సహకరించాలని కోరారు. పోటి పెట్టవద్దని రాహుల్ గాంధీ, కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. బిఎల్ ఎఫ్ ఇప్పటికే వీరికి మద్దతు ప్రకటించింది.

విమలక్క

తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జె కట్టి, చేతుల డప్పు పట్టి పల్లె పల్లెకు తిరిగి తెలంగాణ రాష్ట్ర సాదన కోసం పోరాడిన గద్దర్, విమలక్కలు పోటి చేయనుండటంతో అది కూడా కేసీఆర్, కేటిఆర్ లపై కావడంతో రాజకీయం వేడెక్కింది. వీరిద్దరికి కూడా ప్రజలలో మంచి ఆదరణ ఉండటంతో వీరి పోటి ఉత్కంఠగా మారింది. కేసీఆర్, కేటిఆర్ లను ఓడించేందుకు అన్ని పార్టీలు కూడా వీరి అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

అయితే వీరు పార్టీల నుంచి కాకుండా స్వతంత్రంగా పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్వతంత్రంగా పోటి చేసి అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని అలా అయితే గెలుపు సులువనే ఉద్దేశ్యంతో ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది. హేమా హేమిల పోరు ఎలా ఉండబోతుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.