గులాబీ నజర్‌.. ‘గ్రేటర్‌ డ్యామేజీ’ కంట్రోల్‌ ఎలా.?

TRS Leads in GHMC, but BJP surprises with its win on 40 segments
గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి గట్టి దెబ్బే తగిలింది. సెంచరీ కొట్టేస్తాం.. అని గులాబీ శ్రేణులు ధీమాగా చెప్పుకున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖచ్చితంగా 104 సీట్లు గెలుస్తామని కుండబద్దలుగొట్టేసినా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. సెంచరీ కొట్టే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్‌.. అని సవాల్‌ చేసినా.. అంతా హంబక్‌ అని తేలిపోయింది.
 
TRS Leads in GHMC, but BJP surprises with its win on 40 segments
 
భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. నిజానికి, బీజేపీ కూడా సెంచరీ కబుర్లు చెప్పినా, ఆ పార్టీ అసలు సింగిల్‌ డిజిట్‌ దాటడమే కష్టమని చాలామంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పది డివిజన్లు గెలిచినా అదో గొప్ప విషయమే. అలాంటిది ఏకంగా 40 పైన సీట్లు సాధిస్తోంది బీజేపీ. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ 60 మార్కు రీచ్‌ అవడమే కష్టంగా మారిపోయింది. ఎందుకిలా.? ఎక్కడ ఈక్వేషన్స్‌ తేడా కొట్టేశాయ్‌.!
అతి ఎక్కువ, అభివృద్ధి తక్కువ.!
గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి.? హైద్రాబాద్‌ మేయర్‌గిరీని టీఆర్‌ఎస్‌కి కట్టబెడితే ఏం ఉద్ధరించారు.? అన్న ప్రశ్న నగరవాసుల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. మేం అక్కడ ఫ్లై ఓవర్‌ కట్టాం.. ఇక్కడ ఇంకోటేదో చేశాం.. అని టీఆర్‌ఎస్‌ చెప్పుకుందిగానీ, హైద్రాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గలేదు.. బోనస్‌గా వరద ముంపు హైద్రాబాద్‌కి టీఆర్‌ఎస్‌ హయాంలో పెరిగిందన్న వాదనలకు బలం చేకూరింది. అలా, టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. అయితే, రెండోసారి మేయర్‌గిరీ దక్కించుకునే క్రమంలో కొంత వ్యతిరేకత తప్పదనీ, బీజేపీ చేసిన అడ్డగోలు ప్రచారం కొంతమేర తమను దెబ్బతీసిందని టీఆర్‌ఎస్‌ అంటోంది.
 
బీజేపీ.. అదరగొట్టేసిందంతే..
 
పది సీట్లు బీజేపీకి వస్తే గొప్ప విషయం.. అని చాలామంది వెటకారాలు చేశారు. ఏకంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని, కమెడియన్‌ బండ్ల గణేష్‌తో పోల్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత. కానీ, గ్రేటర్‌లో బీజేపీ దెబ్బ ఏంటో టీఆర్‌ఎస్‌కి రుచి చూపించారు బండి సంజయ్‌. మొత్తంగా బీజేపీ అధినాయకత్వం గ్రేటర్‌ ఎన్నికల్లో పక్కాగా ప్లాన్‌ చేసి, చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ప్రధాని వేరే కారణాలతో హైద్రాబాద్‌కి వచ్చినా, అదీ గ్రేటర్‌ ఎన్నికల్లో కొంత ఉపయోగపడిందన్నది నిర్వివాదాంశం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు బీజేపీ పెద్దలు గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలపై పెట్టిన శ్రద్ధ మంచి ఫలితాన్నే ఇచ్చింది.

ఏమవుతుంది, గ్రేటర్‌ హైద్రాబాద్‌లో.!

‘రెండు మూడు నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొడతాం..’ అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ఇదే మాట మజ్లిస్‌ పార్టీ కూడా చెప్పింది. మరిప్పుడు ఏం జరగబోతోంది.? మజ్లిస్‌ – బీజేపీ కలిస్తే.. మేయర్‌గిరీని దక్కించుకోవచ్చు.. కానీ, అది సాధ్యమయ్యే పనే కాదు. కేసీఆర్‌ని పడగొడ్తామని.. రెండు పార్టీలూ చెప్పాయి గనుక.. ఆ రెండు పార్టీలూ చేతులు కలిపితే.! టీఆర్‌ఎస్‌కి ఖచ్చితంగా కష్టకాలమే.. అయితే, ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి.. ఇటు బీజేపీ, అటు మజ్లిస్‌.. ఈ రెండిటి పోటుని టీఆర్‌ఎస్‌ తట్టుకోవాల్సి వుంటుంది. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కి అసలు సిసలు తలనొప్పి ఇప్పుడే మొదలైంది. తెలంగాణలో ఎవరూ ఊహించని రాజకీయాలు ముందు ముందు చోటు చేసుకోబోతున్నాయ్‌.