తెలంగాణ కాంగ్రెస్ కు తగిలిన బిసి సెగ

తెలంగాణలో మహా కూటమి పేరుతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు ముందుకు సాగుతున్న వేళ ఆ పార్టీకి చేదు కబురు అందింది. గాంధీభవన్ లో గురువారం జరిగిన ఒక అంతర్గత వ్యవహారం పార్టీ పెద్ద నేతలకు గుబులు రేపుతున్నది. పార్టీలో బిసిలకు చిన్నచూపు చూస్తున్నారని, బిసిలకు తగిన సీట్లు ఇవ్వాలని బిసిలు కోరుతున్నారు. కేవలం రెడ్ల పార్టీగానే కాంగ్రెస్ పార్టీ ఉందంటూ విమర్శలు వస్తున్నవేళ బిసి నేతలు నిరసన గళం వినిపిస్తూ గాంధీభవన్ మెట్లెక్కడం చర్చనీయాంశమైంది.

హేమాహేమీలు, డజన్ల కొద్ది ముఖ్యమంత్రి క్యాండెట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో బిసి సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. కేవలం ఒకే ఒక్క రెడ్డి సామాజికవర్గానికి కాంగ్రెస్ లో పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలకు మరింత బలం చేకూరింది బోధన్ వివాదం. గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిసిల సెగ గట్టిగానే తాకింది. ఐదుసార్లు రెడ్డికే టికెట్ ఇస్తే బిసిలు టికెట్ అడగొద్దా అని గాంధీభవన్ పెద్దలను ప్రశ్నించారు బిసి నేతలు.

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ బిసిలకు టికెట్లు ఇవ్వలేదు. గడిచిన ఐదు టర్మ్ లలో కూడా మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డికే టికెట్ కేటాయించారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ అన్నట్లు ప్రచారం జోరందుకున్నది. పి.సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా షురూ చేశారు. గురువారం నాడు బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. రేవంత్ పర్యటనకు పి సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన బిసి (మున్నూరు కాపు కులానికి చెందిన) నాయకుడు ఉప్పు సంతోష్ గాంధీ భవన్ మెట్లెక్కాడు. తన అనుచరగణంతో పాటు పలువురు బిసి ఇంటలెక్షవల్స్ ను కూడా తీసుకుని వచ్చి తనకు బోధన్ సీటు కేటాయించాలని కాంగ్రెస్ నేతలను కోరారు. ప్రస్తుతం సామాజిక తెలంగాణ పోరాట సమితికి ఉప్పు సంతోష్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.

గాంధీభవన్ లో ఆయన తన అనుచరులతో ఆందోళన చేపట్టారు. బిసిలకు అన్యాయం చేస్తున్నారని, సీట్లన్నీ రెడ్లకే కట్టబెడుతున్నారని ఉప్పు సంతోష్ ఆరోపించారు. అదే సమయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భక్త చరణ్ దాస్ గాంధీభవన్ లోనే ఉన్నారు. అయితే వీరి ఆందోళన గురించి తెలియగానే భక్త చరణ్ దాస్ బయట ఆందోళన చేస్తున్న ఉప్పు సంతోష్ దగ్గరకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. బోధన్ లో 5సార్లు సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే అవకాశం ఇచ్చారని మళ్లీ ఆయనకే ఇస్తారని ప్రచారం జరగడం బాధాకరమన్నారు ఉప్పు సంతోష్.

 

30 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసినా ఫాయిదా లేదా ? : ఉప్పు సంతోష్

గాంధీభవన్ లో ఆందోళన చేసిన విషయమై ఉప్పు సంతోష్ ‘తెలుగురాజ్యం’తో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని చెప్పారు. గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశానన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేశాను. జిల్లాలో పలు ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేశానని చెప్పారు. తమ నియోజవర్గంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి 40వేల పైచిలుకు ఓట్లు ఉంటాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వరుసగా రెడ్లకే బోధన్ సీటును కట్టబెడితే బిసిలు ఓట్లు వేస్తూ పోవాలా అని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేని పనిని తాను చేపట్టానని చెప్పారు. అంబేద్కర్ మనవడు రాజారతన్ అంబేద్కర్ ను బోధన్ కు తీసుకొచ్చి పదివేల మందితో సభ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో 70 ఏళ్లు దాటిన వారిని పక్కన పెట్టాలన్న పాలసీని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. సుదర్శన్ రెడ్డికి 70 ఏళ్లు వయసు వచ్చినందున ఆయనను వీలైతే పెద్దల సభకు పంపాలని తనకు బోధన్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు చెప్పారు. తెలంగాణలో ఆంధ్రోళ్ల పాలన అంతం చేశామని సంతోషంగా ఉండే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రోళ్లను వెల్లగొడితే అగ్రవర్ణాలు రాజ్యమేలుతున్నారని నిమ్న జాతులకు మళ్లీ అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఎంతకాలం ఇలా అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తూ పోతాయని ఆయన ప్రశ్నించారు.

బోధన్ సీటు ఆశిస్తున్న కాంగ్రెస్ బిసి నేత ఉప్పు సంతోష్

భక్త చరణ్ దాస్ తమ ఆందోళనపై చాలా పాజిటీవ్ గా స్పందించారని ఉప్పు సంతోష్ వెల్లడించారు. బోధన్ సీటు తనకే ఇస్తారని సుదర్శన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని భక్త చరణ్ దాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి సీట్లు ఇస్తామని చెప్పలేదని, సదుర్శన్ రెడ్డి చెప్పుకుంటున్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తమకు చెప్పారన్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని భక్త చరణ్ దాస్ కు విన్నవించుకున్నట్లు చెప్పారు. తనకు సీటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నానని ఉప్పు వెల్లడించారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో బిసిలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గొంతు విప్పుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఉప్పు సంతోష్ ఏమంటున్నారో భక్త చరణ్ దాస్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

uppu santhosh