KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ ఏడాది తమ పార్టీకి తమకు చాలా గడ్డుకాలంగా గడిచిపోయిందని ఈయన వెల్లడించారు. తెలంగాణ భవన్ లో రసమయి బాల కిషన్ రూపొందిం చిన ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్ ను ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో ఏం జరిగిందో కండ్లకు కట్టినట్టు చూపించారని తెలిపారు.
గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా ఓడిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు..ఇలా పార్టీ ఓడిపోవడంతో పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కవితకు ఐదు నెలల జైలు శిక్ష పడటం, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాలేదు.
పార్టీ పెట్టిన ఈ పాతిక సంవత్సరాలలో మాకు ఇలాంటి దుస్థితి ఎప్పుడు కలగలేదని ఈ ఏడాది చాలా కష్టంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్ తో పోలిస్తే మాకు 1.8% ఓట్ల తేడా మాత్రమే ఉందని అన్నారు. బీఆర్ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదని చెప్పారు. అధికారం మాత్రమే కోల్పోయిందని, అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తుతామని చెప్పారు. ప్రజలలో ఎక్కడ కూడా పార్టీపై నమ్మకం అభిమానం తగ్గలేదని తెలిపారు. ఇటీవలే పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలమే అయింది అయినప్పటికీ ఈ పార్టీ పట్ల ప్రజలలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీభవన్ బోసిపోయిందని తెలంగాణ భవన్ కళకళలాడుతుంది అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.