గాంధీ భవన్ లో రసాభాసా, కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

గాంధీ భవన్ లో సన్మాన కార్యక్రమం రసాభాసాగా మారింది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా భట్టి విక్రమార్క ఎంపికైనందున ఆయనకు సన్మాన కార్యక్రమం శనివారం గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నే వీహెచ్ కూడా హాజరయ్యారు. అంబర్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత శ్రీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు.

వీహెచ్ మాట్లాడుతుండగా శ్రీకాంత్ అనుచరులు ఒక్కసారిగా ఆందోళన నిర్వహించారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నాడని వారు విమర్శించారు. దీంతో కోపంతో వీహెచ్ వారిని తిట్టాడు. ఒక్కసారిగా శ్రీకాంత్ అనుచరులు వీహెచ్ పైకి దూసుకు వచ్చారు. వీహెచ్ అనుచరులకు, శ్రీకాంత్ అనుచరులకు మధ్య వాగ్వాదం నడిచింది. ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు.

దీంతో కార్యక్రమం అంతా రసాభాసగా మారింది. భట్టి అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇరువర్గాల నాయకులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. ఎన్నికలు అయిపోయినా కాంగ్రెస్ కార్యకర్తల కుమ్ములాటలు ఆగడం లేదని పలువురు విమర్శించారు.