ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో విపక్షాలు ఆనందంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. టీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ విజేత, కాంగ్రెస్ నేత అయిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని చెప్పారు. ఈ ఫలితాలు టీఆర్ఎస్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై తాను పోరాడుతానని జీవన్ రెడ్డి చెప్పారు. తనపై నమ్మకముంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రజాగొంతుకనై శాసనమండలిలో ప్రభుత్వ విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన గ్రూప్-1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై జీవన్ రెడ్డి ఏకంగా 39,430 ఓట్ల తేడాతో గెలుపొంది సంచలనానికి తెర తీశారు.