ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగిసి, ఉపసంహరణలు, ఏకగ్రీవాల చుట్టూ రాజకీయం తిరుగుతున్న వేళ.. కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్న వైఎస్సార్సీపీ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్‌లు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
క్షేత్రస్థాయిలో వీరు సైలెంట్ గానే తమ వ్యూహాలకు పదును పెడుతుండటంతో అధికార కూటమి స్థానిక శ్రేణుల్లో కంగారు మొదలైంది. ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఎక్కువ ఓటర్లున్న మేజర్ పంచాయితీలు, పెద్ద గ్రామాలను ప్రధాన టార్గెట్‌గా చేసుకుని ముందుకు సాగుతున్నారు. గన్నవరం, గుడివాడ పరిధిలోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకుని, నియోజకవర్గాల్లో తమ పట్టును చాటాలని పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
ఇందులో భాగంగానే గన్నవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం వేదికగా వంశీ యాక్టివ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు, రాజకీయ ఒత్తిళ్ళు నడుస్తున్నప్పటికీ, వంశీ క్షేత్రస్థాయిలో వెనక్కి తగ్గకుండా క్యాడర్‌ను ముందుకు నడిపిస్తుండటం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గుడివాడలో కొడాలి నాని పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టకుండా, పైకి ఎలాంటి హడావుడి లేకుండానే అంతర్గతంగా వార్డుల వారీగా, గ్రామాల వారీగా క్యాడర్‌తో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు.
నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేయకుండా, విత్ డ్రాల కోసం ఒత్తిడి తెచ్చినా లొంగిపోకుండా వెనకుండి పూర్తి భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను, హామీల అమలుపై వైఫల్యాలను ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న వేళ, వంశీ-నానిల సైలెంట్ ఆపరేషన్ అధికార పార్టీ ఇన్‌చార్జ్‌లకు సవాల్‌గా మారుతోంది.