విజయనగరం పరిషత్ పోరులో బొత్స ఫ్యామిలీ పాలిటిక్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిన వేళ, విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన మార్క్ ఫ్యామిలీ పాలిటిక్స్‌కు తెరలేపారు. జిల్లాలోని మొత్తం 27 జడ్పీటీసీ స్థానాలకు గానూ, ఏకంగా నలుగురు బొత్స కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయించడం ఇప్పుడు ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

జడ్పీ చైర్మన్ రేసులో నిలిచేందుకు వీలుగా పక్కా వ్యూహంతో ఈ నామినేషన్లు వేయించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల పోటీ వివరాల్లోకి వెళితే… బొండపల్లి జడ్పీటీసీ స్థానం నుండి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష నామినేషన్ దాఖలు చేశారు. అలాగే గరివిడి స్థానం నుండి బొత్స కోడలు బొత్స పూజిత, గుర్ల జడ్పీటీసీ స్థానం నుండి బొత్స సోదరి ఈపూరు వెంకటలక్ష్మి బరిలోకి దిగారు. వీరితో పాటు పూసపాటిరేగ స్థానం నుండి బొత్స తమ్ముడి కుమారుడు బొత్స లక్ష్మణ్ చైతన్య నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కీలక స్థానాల్లో పోటీ పడుతుండటంతో విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. అయితే, బొత్స కుటుంబం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయంపై సొంత పార్టీలోని కొందరు స్థానిక నేతలు తెరవెనుక అసంతృప్తి వ్యక్తపరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐదేళ్ల పాటు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన ఇతర కార్యకర్తలకు కాకుండా, కీలకమైన స్థానాలన్నీ ఒకే కుటుంబానికి కేటాయించడంపై అంతర్గత చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు, ప్రత్యర్థి కూటమి అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని విజయనగరంలో మళ్లీ పట్టు నిలుపుకోవాలంటే బొత్స కుటుంబం రంగంలోకి దిగడం అనివార్యమని ఆయన అనుచరవర్గం సమర్థిస్తోంది. ఏది ఏమైనా, బొత్స ఫ్యామిలీ ప్లాన్‌తో విజయనగరం జడ్పీ పీఠం పోరు రసవత్తరంగా మారింది.