YSRCP : వైఎస్సార్సీపీ ఎందుకీ ఫెయిల్యూర్ పబ్లిసిటీ స్టంట్స్‌ని ఎంచుకుంటోంది.?

YSRCP :  దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడుకోవడంలో అర్థమే లేదనుకోండి.. అది వేరే సంగతి. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆ లెక్కన, ఆంధ్రప్రదేశ్ కొత్తగా అప్పులు చేయడాన్నీ తప్పు పట్టలేం.

నిజానికి, రాష్ట్రం విభజన కారణంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి కోలుకున్నా కోలుకోకున్నా.. ప్రజలకు రికార్డు స్థాయిలో సంక్షే పథకాలు అందించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ కోణంలో చూస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది బెస్ట్ అని చెప్పక తప్పదు.

అయినాగానీ, గత కొన్నాళ్ళుగా వివిధ అంశాలతో అధికార వైసీపీ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు, ప్రభుత్వ పరంగా జరుగుతున్నకీలక నిర్ణయాలు.. ఇవన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు సంబంధించిన మంచి మంచి విషయాల్ని మరుగున పడేలా చేస్తున్నాయి.

ఏ వివాదాలూ లేకుండా రాష్ట్రం ముందడుగు వేయగలిగితే.. రాష్ట్రం అనేక సమస్యల నుంచి బయటపడుతుంది. కానీ, చీటికీ మాటికీ వివాదాలే తెరపైకొస్తున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా.? 26 జిల్లాలు ఇప్పుడెందుకు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయినాగానీ, వైఎస్ జగన్ సర్కార్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది.

విపక్షాలు రాజకీయమే చేస్తాయి, చెయ్యాలి కూడా. గతంలో వైసీపీ చేసిందీ అదే. కానీ, ప్రభుత్వం ఏం చేయాలి.? వీలైనంత వరకు ఏ నిర్ణయమూ వివాదాస్పదం కాకుండా చూసుకోవాలి. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో అయినా అంతే. కానీ, అన్నిటా వివాదాలే అంటే, చేసిన మంచి పనులూ కాలగర్భంలో కలిసిపోతాయ్. అది రాజకీయంగా వైసీపీకి అనూహ్యమైన ఎదురు దెబ్బగానే భావించాలి.