Gudivada : గుడివాడపై ఈ అత్యుత్సాహమెందుకు.? ఎవరిది ఈ పాపం.?

Gudivada : గుడివాడలో కాసినో నిర్వహణ జరిగిందా.? లేదా.? అన్నది తేల్చాల్సింది పోలీసు వ్యవస్థ. కాసినో నిర్వహణ జరిగిందని సాక్షాత్తూ ఆ కాసినో నిర్వాహకులే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి, ఆ పోస్టుని ఆ తర్వాత తీసేశారు. సోషల్ మీడియా వేదికగా గుడివాడలో కాసినోకి సంబంధించి చాలా వీడియోలు ఇంకా దర్శనమిస్తూనే వున్నాయి. కాసినోకి వచ్చి, డబ్బులు సంపాదించుకున్నోళ్ళు, పోగొట్టుకున్నోళ్ళను పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. వీడియో ఆధారాలు వున్నాయి గనుక.

సరే, అసలు కాసినో ఎక్కడ జరిగింది.? అన్నది ఎప్పటికి తేలుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఈలోగా టీడీపీ నానా హడావిడి చేసింది. కొత్తగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. జనసేన సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తోంది. ఇంత జరుగుతున్నా, అధికార వైసీపీ మాత్రం, ‘అబ్బే, అస్సలక్కడ ఏమీ జరగలేదు’ అని చెబుతోంది.

మరోపక్క, వైసీపీ సానుభూతిపరుడైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం, గుడివాడలో కోడి పందాలు, జూదం జరిగాయనీ, తన స్నేహితులే ఆ శిబిరం నిర్వహించారని చెప్పుకొచ్చారు. కొడాలి నాని కోవిడ్ కారణంగా అందుబాటులో లేకపోవడంతో, నిర్వాహకులు తనను సంప్రదించినట్లు చెప్పారు వల్లభనేని వంశీ.

మేటర్ క్లియర్. జరిగిన వ్యవహారానికి కోడి పందాలు, వాటికి సంబంధించిన గుండాట వ్యవహారాలుగా పేర్కొంటూ, ‘శిబిర’ నిర్వహణపై వల్లభనేని వంశీ స్పష్టతనిచ్చేశారు. పైగా, వల్లభనేని వంశీ స్నేహితులే ఆ నిర్వాకానికి పాల్పడ్డారట. వారిని పోలీసులు అరెస్టు చేసి, మీడియా ముందుంచేస్తే మంత్రి కొడాలి నానికి తలనొప్పి తగ్గిపోతుంది. కానీ, అలా జరగడంలేదు.

గుడివాడకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళితే ఏమవుతుంది.? వెళతారు, చూస్తారు.. వచ్చేస్తారు. దానికి వైసీపీ ఎందుకు యాగీ చేయడం.? బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డకుని ఏం సాధిస్తారు.? గుడివాడ వేదికగా ఇంత యాగీ జరగాల్సిన అవసరమే లేదు. కానీ, జరుగుతోంది. ఎవరికోసం.? ఎందుకోసం.?