ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరు ముగ్గురూ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, వారి స్నేహబంధం మాత్రం కొనసాగుతోందనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
వంగవీటి రాధాకృష్ణ ఇటీవల కుమార్తెకు జన్మనివ్వగా, ఆమెకు రుధిర అని పేరు పెట్టారు. సోమవారం రాత్రి విజయవాడలో చిన్నారి రుధిరకు ఉయ్యాల కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రాధా సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజా వంటి నేతలు ఉన్నారు. ఈ సందర్భంగానే వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఒకే వేదికపై కలిసి కనిపించారు. చిన్నారిని ఆశీర్వదించిన అనంతరం వీరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
మాజీ సీఎం జగన్ రోడ్ షోకు నో: జాతీయ రహదారిపై కాన్వాయ్‌కు అనుమతి నిరాకరణ!
ఉచిత పథకాలు, ఆర్థిక వ్యవస్థపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళన
ఈ ముగ్గురు నేతలు గతంలో మంచి స్నేహితులుగా ఉండేవారు. ప్రస్తుతం కొడాలి నాని, వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, వంగవీటి రాధా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. రాజకీయంగా విభిన్న ధృవాలుగా ఉన్నప్పటికీ, రాధా వ్యక్తిగత కార్యక్రమానికి వీరిద్దరూ హాజరు కావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. “రాజకీయాలు వేరు, స్నేహం వేరు” అంటూ ఈ ఫోటోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా స్నేహాన్ని గౌరవించినందుకు వంగవీటి రాధాను పలువురు ప్రశంసిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ ముగ్గురు నేతలు ఒకే చోట కనిపించడం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ, తిరిగి టీడీపీలో ప్రయాణం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసినా, ఆయనకు పదవి దక్కలేదు. ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిలతో వివాహమైంది. మొత్తానికి, తాజా ఫోటోతో ఈ ముగ్గురు నేతల స్నేహం గురించి మరోసారి చర్చ జరుగుతోంది.

