విశాఖ ఉక్కు ఉద్యమం ఉద్ధృతమవుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నవిశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. అలాగే సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలనే డిమాండ్లను కూడా చేర్చాయి. ఆయా డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును విశాఖ ఉక్కు సీఎండీకి అందజేశాయి.
ఆర్-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ తేల్చి చెప్పింది. ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా ఉక్కు నినాదం ఎగసి పడుతోంది. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు… కొనేదెవరు..అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నట్టు.. సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారమన్ చేసిన ప్రకటనతో నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.
ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం స్టీలుప్లాంటు పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. ఈ క్రమంలో స్టీలుప్లాంటు డైరెక్టర్ వేణుగోపాలరావు కారును చుట్టుముట్టి కదలనీయకుండా చేశారు. సుమారు ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టారు. స్టీల్ ఉన్నతాధికారులనే కాదు అవసరమైతే ప్రజా ప్రతినిధులను నిర్బంధిస్తామంటున్నాయి కార్మిక సంఘాలు. ప్రజాప్రతినిధులంతా వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపడంతో.. ఏపీలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది కలిగించని కార్మిక సంఘాలు ఇకపై సమ్మెకు కూడా సిద్ధమని తేల్చి చెప్పేశాయి. మార్చి 25 తర్వాత సమ్మెకు వెళతామని యాజమాన్యాన్ని హెచ్చిరిస్తున్నాయి.