TTD : నో డౌట్, టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతోంది.!

TTD : అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం.. ఇదంతా సర్వసాధారణమే. కానీ, టీటీడీ లాంటి వ్యవస్థల విషయానికొచ్చేసరికి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అధికారంలో వున్నోళ్ళయినా, విపక్షంలో వున్నోళ్ళయినా. ఎందుకంటే, అది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. పార్టీలకు సంబంధించిన సొంత రాజకీయ వ్యవహారం కాదు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయా సేవల టిక్కెట్ల ధరలు, దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల వ్యవహారంపై ఎప్పటికప్పుడు వివాదాలు తెరపైకొస్తూనే వున్నాయి. సర్వదర్శనం కోటా తగ్గించేసి, స్పెషల్ దర్శనాల కోటా పెంచేయడంపై చాలాకాలంగా విమర్శలొస్తున్నా, టీటీడీ మాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది.

లడ్డూ ధరల పెరుగుదల, సేవల ధరల పెరుగుదలతో సామాన్య భక్తులు విలవిల్లాడుతున్నారు. అయినా, దేవాలయాల్లో ప్రసాదాన్ని డబ్బులిచ్చి ఎందుకు కొనుక్కోవాలి.? అన్నది హిందువుల సూటి ప్రశ్న. దేవుడ్ని దర్శించుకోవడానికి టిక్కెట్టు కొనుక్కోవడమా.. ఇదేం ఖర్మ.? అన్న ఆవేదన చాలాకాలంగా హిందువుల్లో వుంది.

ఆ ఆవేదన అలా వుండగానే, సేవల టిక్కెట్ల ధరల విషయమై ‘మార్కెట్లో వేలం పాట’ తరహాలో బోర్డు సభ్యులు మాట్లాడిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. బోర్డు సభ్యులు, టీటీడీని ‘సంతలా’ మార్చేశారన్నది సగటు హిందువుల ఆవేదన.

‘అబ్బే, అక్కడ జరిగింది వేరు..’ అంటూ టీటీడీ ఛైర్మన్ పదే పదే వివరణ ఇస్తున్నాసరే, టీటీడీ పాలక మండలి పట్ల హిందువుల్లో ఏహ్యభావం పెరిగిపోయింది. ‘ఛీ.. రాజకీయ నిరుద్యోగులకు పునారావాస కేంద్రాలుగా హిందూ దేవాలయాల పాలక మండళ్ళు మారిపోవడమా.?’ అంటూ జనం ఛీత్కరించుకుంటున్నారు.

ఇంతా జరుగుతున్నా, జగన్ సర్కారు.. ఈ తాజా పరిణామాల పట్ల స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం శోచనీయం.