రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదు అంటారు.. మరి మన తెలంగాణ దొర కేసీయార్ సార్ తన కూతురు గత ఎన్నికల్లో పోటీ చేసిన నిజమాబాద్ స్దానం మీద ఎక్కువ మనస్సు పెట్టనట్టుగా ఉన్నాడు. అంతా మనవాళ్లే కదా, మన కనుచూపు మేరలోనే రాజకీయాలు సాగుతున్నాయి.. అందుకే కవిత గెలుపు పెద్ద విషయం కాదని భావించాడు కానీ ఊహించని దెబ్బ తగిలింది.. కవిత ఘోరంగా ఓటమిని మూట గట్టుకుంది. ఈ నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యేలపై కేసీఆర్, కవిత, కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూవచ్చారన్న విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మాత్రం కల్వకుంట్ల కవిత గెలుపును అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న ప్రచారం జరుగుతుంది..
ఎన్నికలకు 10 రోజులే గడువు ఉండటంతో జోరుగా ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపడుతూ.. కారు దూకుడుగా వ్యవహరిస్తోందంటున్నారు.. ఇక ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్న నేతల్లో జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ పెద్దలైన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్ కవితకు భారీ మెజార్టీ కట్టబెట్టే విధంగా చక్రం తిప్పుతున్నారట. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ను టీఆర్‌ఎస్ గూటికి చేర్చుకున్నారట.
వీరే కాకుండా జిల్లాలో బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే కారెక్కగా, మరికొంత మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లోకి క్యూ కడుతున్నారని ప్రచారం సాగుతుంది.. మరోవైపు మొత్తం ఓటర్లలో 75 శాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నందున కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ చక్రం స్పీడుగా తురుగుతూ వేడెక్కిందని తెలుస్తుంది..