తెలంగాణ శాసనమండలి వేదిక భావోద్వేగాలకు కేరాఫ్‌గా మారింది. ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ప్రసంగం సభను ఉలిక్కిపడేలా చేసింది. ఇదే తన చివరి ప్రసంగమంటూ గొంతు బిగుసుకున్న కవిత, కన్నీళ్ల మధ్యే తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరారు. ఇప్పుడు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను.. కానీ బలమైన శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి వస్తాను.. అంటూ చేసిన ప్రకటన సభలో నిశ్శబ్దాన్ని నింపింది.
ప్రసంగం ప్రారంభం నుంచే కవిత తన ఆవేదనను నిర్మొహమాటంగా వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కార్యకర్తలకు బీఆర్ఎస్ పాలనలో న్యాయం జరగలేదని ఆరోపించారు. ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలన్న ప్రతిపాదనను అడ్డుకున్నారని, నీళ్లు–నిధులు–నియామకాల నినాదాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇసుక దందా పేరుతో అక్రమాలు పెరిగాయని, ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండలి వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని తాను అంగీకరించలేదని చెప్పిన కవిత.. తెలంగాణలో ఏం చేశామని నేషనల్ పార్టీ.. అని అప్పుడే ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందని, ఆ కఠిన సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల పాటు ఈడీ, సీబీఐ కేసులతో ఒంటరిగా పోరాడానని, పార్టీ తనను పట్టించుకోలేదని అన్నారు.
కేసీఆర్‌పై కమిటీలు, విచారణల మాట వచ్చినప్పుడల్లా నోరు మూసుకున్నారని, హరీశ్‌పై అవినీతి ఆరోపణలు ప్రస్తావించగానే తనను సస్పెండ్ చేశారని కవిత మండిపడ్డారు. పార్టీ రాజ్యాంగం ఒక జోక్‌లా మారింది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పద్ధతి లేని రాజకీయాలకు దూరమయ్యానన్న సంతృప్తి తనకు ఉందని చెప్పారు.
తన సస్పెన్షన్‌ను రాజకీయంగా వాడుకోవాలన్న ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కవిత, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, తన ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నానంటూ ఇది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయతీ అని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం జరగాలంటే పార్టీల రాజ్యాంగాల్లో మార్పు అవసరమని సూచించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రసంగం ముగింపులో మరోసారి శాసనమండలికి వీడ్కోలు చెబుతూ, ఇదే నా చివరి ప్రసంగం. వ్యక్తిగా వెళ్తున్నాను.. కానీ ప్రజల మద్దతుతో మరింత బలంగా తిరిగొస్తాను అంటూ కవిత చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.
