ఆంధ్రాలో సీఎం జగన్ మీద విపక్షాలన్నీ కత్తి కట్టి యుద్దం చేస్తున్నాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం, ఇంకో వైపు బీజేపీ-జనసేన కూటమి. ఇలా రెండు వైపుల నుండి ఎటాక్ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారేమో జగన్ సర్కార్ అన్ని విధాలా రాష్ట్రాని భ్రష్టు పట్టించిందని, అప్పుల ఊబిలోకి నెట్టిందని, జగన్ పాలనలో అసమర్థుడని రకరకాలుగా విమర్శిస్తున్నారు. అమరావతి అంశం, న్యాయస్థానాల మీద దాడి, తమ పార్టీ నేతల మీద అక్రమ అరెస్టులు అంటూ రకరకాలుగా దుయ్యబడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ కూలిపోయి తామే గెలుస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ఒకసారి రాజీనామాల ఛాలెంజ్ కూడ విసిరారు. అయితే అదేమంత ప్రభావం చూపలేదనుకోండి.
ఇక బీజేపీ అయితే రాష్ట్రాన్ని ఉద్దరించగలిగేది తాము మాత్రమేనని డబ్బా కొట్టుకుంటోంది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన నాటి నుండి హిందూత్వాన్ని భుజాన మొస్తూ మతం వైపు నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. దేవాలయాల మీద దాడులు, క్రిస్టియానిటీని పెంపొందించడానికి హిందూ మతాన్ని అణగదొక్కాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అంటూ ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ లేని మతం వివాదాన్ని రాజేసి చలికాచుకుంటోంది. అంతేనా… 2024 లో తామే అధికారంలోకి వస్తామంటూ నియోజకవర్గాల వారీగా తమ బలాబలాల లెక్కలు చూపిస్తోంది. బీజేపీ అధిష్టానం సైతం ఏపీలో పాగా వేయడానికి ఎన్ని దారులున్నాయో అన్నిటినీ వాడుతోంది.
ఈ ఇద్దరు ప్రత్యర్థుల వాదన ఎలా ఉంది అంటే జగన్ మీద జనం నమ్మకం కోల్పోయారని, తమదే భవిష్యత్తని అంటున్నాయి. మరి ఇంతలా జగన్ మీదకు ఎక్కేస్తూ ఆయనకంటే తామే బెటర్ అంటున్న టీడీపీ, బీజేపీలకు తమ దమ్మేమిటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇటీవల వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ స్థానం ఖాళీ అయింది. అక్కడ త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి టీడీపీ, బీజేపీలు తమ అభ్యర్థులను నిలబెట్టి తమ స్టామినా ఏమిటో చూపించి జనంలో జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత పెరిగిందని నిరూపించాలి.
అప్పుడే వాళ్ళు చేస్తున్న విమర్శలు నిజమని నమ్ముతారు ప్రజలు. ఈ లోక్ సభ స్థానంలో టీడీపీ, బీజేపీలకు మంచి పట్టే ఉంది. అక్కడ టీడీపీకి కావాల్సిన బీసీ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. ఇక బీజేపీ వాడుతున్న హిందూత్వానికి ప్రతీకగా రాష్ట్రంలో తిరుపతిని మించిన ప్రాంతం మరొకటి లేదు. సో.. జగన్ మీద గెలిచేస్తాం అనే వారంతా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా తమ బలాన్ని ప్రదర్శిస్తే రాష్ట్ర ప్రజలంతా చూస్తారు మరి.