TDP Back Step Again : టీడీపీ వెనకడగు.. అలా అలవాటైపోయిందంతే.!

TDP Back Step Again

TDP Back Step Again :  ‘దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి, మళ్ళీ ఎన్నికలకు వెళదాం..’ అంటూ అధికార వైసీపీకి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సవాల్ చేస్తోంది. ‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీదే విజయం.. 160 సీట్లు పక్కా..’ అని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుండబద్దలుగొట్టేస్తున్నారు.

కానీ, ఎలా.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏం జరిగిందో చూశాం. స్థానిక ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయినాగానీ, టీడీపీ తనదైన స్టయిల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వుంది.

నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. డిపాజిట్లు తెచ్చుకోవడానికీ టీడీపీ కష్టపడాల్సి వస్తుందన్నది వైసీపీ వాదన. ‘మీ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వున్నారు కదా.. అందరూ కలిసి రాజీనామా చేసెయ్యండి.. ఎన్నికలొస్తాయ్.. మళ్ళీ మీరంతా గెలిస్తే, టీడీపీ బలంగానే వుందని ఒప్పుకుంటాం..’ అంటోంది వైసీపీ.

అదీ నిజమే కదా.? అయితే, టీడీపీ అంత సాహసం చేసే పరిస్థితుల్లో లేదు. (TDP Back Step Again)  టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన ఎమ్మెల్యేలని సాంకేతికంగా ఇంకా వైసీపీ కలుపుకుపోలేదు. అదే, చంద్రబాబు హయాంలో జరిగినట్లుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచన వైఎస్ జగన్ చేస్తే, చంద్రబాబు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు.

వైసీపీ నుంచి ఎదురుదాడి షురూ అయ్యేసరికి, ‘మేమెందుకు రాజీనామా చేస్తాం.? మీరే రాజీనామా చెయ్యండి..’ అంటూ అచ్చెన్న బుకాయింపులకు దిగుతున్నారు. ‘నిండా మునిగాక చలేంటి.?’ అన్న చందాన, టీడీపీ గనుక, రాజీనామాలకు ‘సై’ అనేసి.. ప్రజా క్షేత్రంలోకి వెళితే కనీసం క్యాడర్‌లో అయినా ఉత్సాహం వస్తుందేమో.!