ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు నాయుడు పనితీరు చూసి ఆ పార్టీ నేతలు, శ్రేణులే తీవ్ర అసంతృప్తికి గురవవుతూ వచ్చారు. ఎంతసేపూ నాన్చుడు ధోరణి తప్ప పార్టీలో ఉత్సాహాన్నిచ్చే ఒక్క నిర్ణయం కూడ తీసుకోవడంలేదని, ఆయన్ను అలసత్వం అనే మాహా చెడ్డ వ్యాధి ఆవహించిందని తెలుగు తమ్ముళ్లు తీవ్ర వేదన చెందారు. నిజమే.. చంద్రబబు రాజకీయం తెలిసిన ఎవరైనా గత ఏడాదిన్నర కాలంగా ఆయన ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే ఇదే మాట అంటారు. సామాన్య జనం సైతం సీఎం పదవికి కొత్తవాడైన జగన్ ను 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఢీకొట్టలేక డీలాపడిపోవడం, ఇలాంటి పేలవమైన పెర్ఫార్మెన్స్ ఆయన్నుండి ఊహించలేదని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ బ్యాడ్ ఫీడ్ బ్యాక్ నుండి మెల్లగా బయటికొస్తున్నారు బాబు.
పార్టీని బలోపేతం చేయడానికి ఉపకరించే నిర్ణయాలను తీసుకుంటున్నారు. అందులో మొదటి అడుగుగా పార్లమెంటరీ ఇంఛార్జిలను నియమించారు ఆయన. కొత్తగా సృష్టించిన ఈ పదవుల్లో చాలామంది పాత వాళ్ళకే అవకాశం ఇచ్చారాయన. అది చూసి మళ్ళీ పాత పాటేనా అంటూ ఉసూరుమన్నారు కార్యకర్తలు. కానీ మెల్లగా వాటి రిజల్ట్స్ చూసి పర్వాలేదే.. ప్లాన్ వర్కవుట్ అవుతోంది అంటున్నారు. నియామకాల్లో భాగంగా కాకినాడ పార్లమెంటరీ జిల్లా చీఫ్‌గా బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు. ఈ నియామకం జిల్లా వ్యాప్తంగా టీడీపీలో కొత్త ఆశలను చిగురించేలా చేస్తోంది. పదవి చేపట్టిన సత్యనారాయణ మూర్తి సమర్థవంతంగా పనిచేస్తున్నారు.
ఇటీవలే నియోజకవర్గం మీద సమావేశం ఏర్పాటుచేసిన బండారు కీలక నేతలందరినీ ఆహ్వానించారు. మొదటి నుండి బండారు సత్యనారాయణ మూర్తికి పార్టీలోని సీనియర్, జూనియర్ లీడర్లతో సత్సంబంధాలున్నాయి. సౌమ్యుడనే పేరుంది. అందుకే ఆయన పిలవగానే యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కొండబాబు లాంటి కీలక నేతలంతా సమావేశానికి హాజరై మద్దతు తెలిపారు. పార్టీ బలోపేతానికి సత్యనారాయణ మూర్తి సూచించిన విధి విధానాలను అంగీకరించారు. అంతేకాదు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలా మిగిలిన పెద్ద నాయకులంతా బండారుకు ఆమోదం తెలపడంతో నియోజకవర్గంలో ఆయన నాయకత్వానికి ప్రతికూలతనేదే లేదని స్పష్టమైంది. ఈ శుభ పరిణామాతో కాకినాడ నియోజకవర్గ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. సత్యనారాయణ మూర్తిని నియమించి బాబు మంచి పని చేశారని, ఆయనలో ఆవహించిన అలసత్వం మెల్లగా తగ్గుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.