‘పవన్ కళ్యాణ్ పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బీజేపీ నాయకత్వం మద్దతు పలకలేదు..’ అని ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడి తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, జనసేన శ్రేణుల్ని తీవ్రంగా నిరాశపరిచారు. అంతకు ముందు బీజేపీ ఏపీ అద్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన – బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి వపన్ కళ్యాణ్.. అని ప్రకటించేసిన విషయం విదితమే. రత్నప్రభ ఇంటర్వ్యూ తర్వాత సీన్ మారింది.
జనసేన శ్రేణుల్లో అలజడి మొదలైంది. ఈ రోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్, రత్న ప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించనుండగా, ఈ వివాదం ముదిరి పాకాన పడింది. అయితే, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టిన రత్నప్రభ, ఆసక్తికరమైన ట్వీటేశారు సోషల్ మీడియాలో.. అదీ పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా. ‘తమ కుటుంబాల కోసం నడిపే టీడీపీ వైసీపీల అవినీతి, అరాచక పరిపాలనకు విసిగిపోయిన ఆంధ్రపజలు ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోడీగారి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి కావాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను..’ అని ప్రకటించారు రత్నప్రభ ట్విట్టర్ ద్వారా. దాంతో వివాదానికి ప్రస్తుతానికి ముగింపు పడినట్లే. అంతకు ముందే, ఇంకో ట్వీట్ కూడా వేశారు రత్నప్రభ.
‘పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తమ కూటమి (బీజేపీ ఓ- జనసేన) ఘనవిజయం సాధిస్తుంది. ఆంధ్రపదేశ్ పాలనలో ఆహ్వానించదగ్గ మార్పు వస్తుంది’ అని ట్వీటేశారు రత్నప్రభ. అయితే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా రాజకీయాలు ఎలాగైనా మారొచ్చు. అందునా, బీజేపీ రాజకీయాలు ఎలా వుంటాయో ఊహించడం అంత తేలిక కాదు. ప్రత్యేక హోదా కావాలని అడిగింది బీజేపీనే, వద్దని లైట్ తీసుకున్నదీ బీజేపీనే.