Ram Gopal Varma : తెలుగు సినీ పరిశ్రమ పెద్దన్నగా రామ్‌గోపాల్ వర్మ.?

Ram Gopal Varma : తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు ఎవరు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తర్వాత, ‘పెద్దరికం’ అన్న పదవి జోలికి ఎవరూ వెళ్ళలేదు. చాలామందికి ‘పెద్దరికం’ తీసుకోవాలని వున్నాగానీ, అది సాధ్యపడలేదు.

చిరంజీవి ఏనాడూ తాను సినీ పరిశ్రమకి ‘పెద్దన్న’ అన్న భావనలో లేరుగానీ, సమస్యల పరిష్కారం కోసం మాత్రం పలువురు సినీ ప్రముఖులు చిరంజీవితో చర్చలు జరుపుతూ వచ్చారు. వారి ఒత్తిడితో చిరంజీవి, పరిశ్రమ తరఫున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించారు.

ఏమయ్యిందోగానీ, తనకు పరిశ్రమ పెద్దరికం.. అనే బాధ్యత వద్దే వద్దని చిరంజీవి తేల్చేశారు. సమస్యల పరిష్కారం కోసం మాత్రం పరిశ్రమ బిడ్డగా తాను ముందుంటానని చెప్పారు తాజాగా. ఇంతలోనే, మోహన్‌బాబు నుంచి ఓ బహిరంగ లేఖ వచ్చింది. ఆ లేఖ సారాంశం, పరిశ్రమ పెద్దరికం తాను తీసుకోవాలని మోహన్‌బాబు అనుకుంటున్నారంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

ఇదిలా వుంటే, ‘ఆర్ఎక్స్ 100’ ఫేం దర్శకుడు అజయ్ భూపతి, ‘మా బాస్ రామ్‌గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక. సామీ.. మీరు రావాలి సామీ..’ అంటూ ట్వీటేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

రామ్‌గోపాల్ వర్మ, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల లిస్టులో ముందు వరుసలోనే వుండేవాడు ఒకప్పుడు. ‘శివ’ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. కానీ, రానురాను ఆయన వివాదాల దర్శకుడైపోయాడు. వివాదాలంటే వర్మ, వర్మ అంటే వివాదాలు తప్ప ఇంకేం లేదు గత కొంతకాలంగా.

సరదాగా అన్నాడో, సీరియస్‌గానే అన్నాడోగానీ, అజయ్ భూపతి.. వర్మ పేరుని భలేగా ఇరికించేశాడు. వర్మ మీద సెటైర్లు.. వర్మ పేరుతో మీమ్స్.. కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయిప్పడు.