పీక్స్… పాతగాయాన్ని రేపుతూ కొత్త గాయం చేస్తూ…!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ – జనసేన తమ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. అలా అనడం కంటే… టీడీపీ తన తొలిజాబితాను, జనసేన తమ ఫైనల్ జాబితానూ ప్రకటించాయని చెప్పడం సమంజసం. కారణం… ఇప్పుడు ప్రకటించిన 118 స్థానాల్లోనూ 94 టీడీపీ పోటీ చేస్తుండగా… మొత్తం 175 లోనూ 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.

దీంతో… ఈ 24 సీట్ల అంశంపై జనసైనికులు, జనసేన సానుభూతిపరులు, కాపు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ ఓటర్లు హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఇంతోటి దానికి పార్టీ, ఒక ప్రత్యేక ప్రచార వాహనం.. పెద్ద టీము.. కార్యకర్తలకు సైనికులు, వీరమహిళలు అనే పేర్లు, పవన్ కల్యాణ్ కనిపించగానే సీఎం సీఎం అనే నినాదాలు.. అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు 24 మాత్రమే ఇవ్వడంపై తనదైన విశ్లేషణ చేస్తున్నారు ఆర్జీవీ.

వాస్తవానికి టీడీపీ, జనసేనలపై ఇటీవల కాలంలో ఆర్జీవీ నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా “23” నెంబర్ పై చంద్రబాబుని “25” నెంబర్ పై పవన్ కల్యాణ్ ని నెట్టింట తీవ్రస్థాయిలో సెటైర్లు పేలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై తనదైన విశ్లేషణ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ విషయం పొలిటికల్ సెటైర్ గా ట్రెండింగ్ లో ఉందనే చెప్పాలి.

2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు.. టీడీపీలో చేర్చుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లోనే గెలిచింది. అప్పటి నుంచి “23” నెంబర్ పెట్టి చంద్రబాబుపై అటు వైసీపీ నేతలు, ఇటు నెటిజన్లు సెటైర్లు పేలుస్తుంటారు. ఇక ఆర్జీవీ అయితే ఈ విషయంలో పీక్స్ కి వెళ్లిపోయారు.

ఇందులో భాగంగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు కేటాయించిన నెంబర్ 7691 లో 7+6+9+1 = 23 అంటూ ఆన్ లైన్ వేదికగా రచ్చ రచ్చ చేశారు. ఆ “23” సంగతి అలా ఉంటే… పవన్ కల్యాణ్ ని వైసీపీ కార్యకర్తలు, పలువురు నెటిజన్లు “పావలా” అని కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే! పావలా అంటే… 25 పైసలు అనేది తెలిసిన విషయమే.

దీంతో… టీడీపీ లక్కీ నెంబర్ 23, పవన్ కల్యాణ్ లక్కీ నెంబర్ 25 కాకుండా… మధ్యలో ఉన్న 24 ను ఫైనల్ చేస్తు జనసేనకు చంద్రబాబు సీట్లు కేటాయించారనేది ఆర్జీవీ లాజిక్. తనదైన లాజిక్కులకు, ర్యాగింగుకూ, పరిపూర్ణమైన వెటకారం కలుపుతూ తాజాగా ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఆర్జీవీ ఒక ట్వీట్ చేశారు.

ఈ మేరకు టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్జీవీ… “23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు.. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు.. అందుకే మధ్యే మార్గంగా 24” అని పోస్ట్ చేశారు. దీంతో… ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది!!