Temple Tickets : సినిమా టిక్కెట్లు కావవి.! దేవుడి దర్శన టిక్కెట్లు.!

Temple Tickets : హిందూ దర్మాన్ని నడి బజార్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఎవరు అధికారంలో వున్నా జరుగుతోన్నది ఇదే. తిరుమల తిరుపతి దేవస్థానం.. తాజాగా మరోమారు వార్తల్లోకెక్కింది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు.

వారిని ఆసుపత్రికి తరలించారు. చాలామందికి స్వల్ప గాయాలయ్యాయి.

రెండ్రోజులపాటు సర్వదర్శన టోకెన్లు నిలిపేసిన టీటీడీ, ఈ రోజు టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టడంతో ఒక్కసారిగా జనం పోటెత్తారు. అయినా, దేవుడ్ని దర్శించుకోవడానికి టోకెన్లు, టిక్కెట్లు ఎందుకు.? అది కూడా కేవలం హిందూ దేవాలయాలకు మాత్రమే ఈ టిక్కెట్లు, టోకెన్ల గోలేంటి.?

వీఐపీల సేవలో దేవాలయా పాలక మండళ్ళు తరలించడం తెలిసిన విషయమే. వీఐపీలు, వీవీఐపీలు.. దేవుడి సేవ పేరుతో.. భక్తులకి దేవుడ్ని దూరం చేస్తుండడం చాలా కాలంగా జరుగుతోన్న తంతు.

ప్రోటోకాల్ పేరుతో, దేవుడి ముందర జనం అంతా సమానం కాదనే సంకేతాల్ని పాలక మండళ్ళు, ప్రభుత్వాలు ఇస్తున్నాయి.

ఫలితం సామాన్య భక్తులిలా రోడ్డున పడాల్సి వస్తోంది. సినిమా టిక్కెట్ల కోసమైతే ఓర్పుగా ఎదురుచూస్తారు.. దేవుడి దర్శన టిక్కెట్ల కోసం వేచి చూడలేరా.? అన్నట్టు పాలక మండళ్ళు వ్యవహరిస్తున్నాయి.

అయినా, దేవుడికి పాలకులేంటి.? ఆ పాలక మండళ్ళేంటి.? అంటే, అది మళ్ళీ వేరే కథ.

పాలక మండళ్ళు.. అంటూ, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస వేదిక.. అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్నమాటే. కష్టాలు చెప్పుకునేందుకు దేవుడి దగ్గరకు వెళ్ళడమే పెద్ద కష్టమైపోయిందిప్పుడు.