గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం చంద్రబాబుకు ఒక భంగపాటు అయితే కుమారుడు నారా లోకేష్ పరాజయం చెందడం తీరని బాధను మిగిల్చింది. మంగళగిరి నుండి పోటీకి దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు ఎన్నో లెక్కలు వేసుకుని బీసీ వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరి నుండి చినబాబుకు పోటీకి నిలిపారు. లోకేష్ గెలవలదు కానీ వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ అయితే ఇచ్చారు. జగన్ హవా గనుక లేకుండా ఉండి ఉంటే లోకేష్ గెలిచినా గెలిచేవారు. ఆ ఎన్నికల్లో లక్షా మూడు వేల పైచిలుకు ఓట్లు లోకేష్ కు పడ్డాయి. అదేమీ చిన్న సంఖ్య కాదు. రామకృష్ణారెడ్డికి, లోకేష్ మధ్యన తేడా 5,300 ఓట్లు మాత్రమే.
మరి ఇంతలా ఆదరించినందుకు మంగళగిరి ఓటర్ల పట్ల లోకేష్ కృతజ్ఞత ఎలా ఉండాలి. అక్కడి శ్రేణులకు, అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటూ పాలక వర్గాన్ని పరుగులు పెట్టించాలి. సమస్య అంటే తానే గుర్తొచ్చేలా అక్కడి జనంలో నమ్మకం తెచ్చుకోవాలి. గత ఎన్నికల్లో తనకు పడని 5 వేల ఓట్లకు ఇంకో 5 వేల ఓట్లు కలుపుకుని 2024 ఎన్నికలో 10 వేల మెజారిటీతో గెలిచేలా పనిచేయాలి. కానీ లోకేష్ ఏం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తుతున్నా ఇప్పటివరకు నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించలేదు. కనీసం తనకు ఓట్లేసిన అభిమానులకైనా కృతజ్ఞత చెప్పే ప్రయత్నమేదీ చేయలేదు.
నిత్యం హైదరాబాద్లోనే ఉంటూ మంగళగిరిని మర్చిపోయారు. సరే.. కరోనా కాలం కాబట్టి మీటింగ్లు పెట్టడం మంచిది కాదని అనుకుందాం. కనీసం అప్పుడప్పుడైనా నియోజకవర్గానికి వెళుతూ తాను అందుబాటులోనే ఉన్నాననే సంకేతాలైనా ప్రజలకు ఇవ్వాలి కదా. స్థానిక నాయకులతో, శ్రేణులతో జూమ్ యాప్ ద్వారానైనా సమావేశాలు పెట్టుకుని బలపడటానికి ప్రయత్నం చేయాలి. అసలు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నాయి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేరుస్తుందా లేదా అనేది చూసుకుని, జనం అవసరాలను తెలుసుకుని ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అలాంటివేం లేకుండా మౌనంగా ఉంటే ఏ ప్రయోజనమూ ఉండదు. లోకేష్ తీరుతో ఆయనకు ఓట్లేసిన మంగళగిరి ప్రజలు విసిగిపోయి ఇలా అయితే ఎమ్మెల్యే కాదు కదా కార్పొరేటర్ కూడ కాలేరని అసహనం వ్యక్తం చేస్తున్నారట.