ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. 2014 ఎన్నికల నుండి కూడా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని జగన్ కంటే ఎక్కువగా కేసీఆర్ కోరుకున్నాడు.
2019 ఎన్నికల్లో జగన్ తరపున కేసీఆర్ ప్రచారం చేసినంత పని చేశారు. చంద్రబాబును ఎన్ని విధాలుగా విమర్శించాలో, అన్ని విధాలుగా విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. అయితే గత కొంత కాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నేతలే. కానీ జగన్ కి తన ప్రాంతం పట్ల కమిట్మెంట్ చాలా ఎక్కువ. అందుకే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టారు, అయితే కేసీఆర్ గోదావరి నీటిని వాడుకోవాలని, ఆ విధంగా వచ్చే మిగులు జలాలతో రాయలసీమను తడుపుకోవాలని సూచించారు. ఇది చెప్పడానికి బాగానే ఉన్నా కూడా అంచనా వేస్తే లక్షల కోట్ల వ్యయం. పైగా తెలంగాణా భూభాగంలో ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ అంతా ఉంచేలా కేసీఆర్ డిజైన్ చేస్తున్నారు. మరి జగన్ అమాయకుడు అనుకున్నారో ఏమో కానీ బేసిన్లూ బేషజాలు లేవు గోదావరి నీళ్ళు వాడుకోమని చెప్పాను అని ఇపుడు అంటున్నారు.
కృష్ణా జలాల మీద పూర్తి హక్కు తనదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క నిర్మాణానికి చాలా పట్టుదలతో కృషి చేస్తున్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాల వల్ల ఏపీకి కృష్ణ జలాలపై ఉన్న హక్కులు హరించుకుపోయాయని, ఇప్పుడు కేవలం రాయలసీమ ప్రజలకు గోదావరి జలాలే దిక్కని, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పైగా వృధాగా పోయే వరద నీటిని వాడుకుంటామని చెప్తున్నా కేసీఆర్ కు ఎందుకు అర్ధం కావడం లేదనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో జగన్ కేసీఆర్ మరిన్ని షాక్ లు ఇవ్వడానికి రెడి అవుతున్నారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న కేసీఆర్ జగన్ కంటే చంద్రబాబే బెటరని అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.