మనిషి ఆరోగ్యాంగా ఉండాలంటే ఆహరం ఎంత అవసరమో “నిద్ర” కూడా అంతే అవసరం. “నిద్ర” అలసిన శరీరానికే కాదు మనసుకి కూడా సేదనిస్తుంది. దాంతో మరుసటి రోజు దినచర్యలకి నూతనోత్సాహంతో శరీరం సిద్దమవుతుంది. సాధారణంగా పెద్ద వయస్సు వారి కన్నా చిన్న పిల్లలకి ఎక్కువ నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు, మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. కొన్ని రకాల ఆహారాలు నిద్ర బాగా పట్టేలా చేస్తాయి, మరికొన్ని నిద్ర నుండి మేలుకొలుపుతాయి. మనిషి శరీరానికి నిద్రని ఒక అద్భుతమైన ఆహారంగా భావించవచ్చు. అలాంటి నిద్ర పొందాలంటే తీసుకోవాలిసిన జాగ్రత్తలు, ఆహార పదార్థాల గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం.
రాత్రి పూట తినే ఆహరం చాలా లైట్ గా ఉండాలి. దాంతో చాలా సులువుగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి తొందరగా నిద్ర పట్టేందుకు ఉపక్రమిస్తుంది. అంతేకాకుండా పడుకునే సమయానికి రెండు గంటల ముందుగానే రాత్రి భోజనం తీసుకుంటే గాఢ నిద్రలోకి శరీరం జారుకుంటుంది. నిద్రపోయే ముందు తీసుకునే ఫుడ్ లో అధిక మోతాదులో ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి.
పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయటం ద్వారా త్వరగా నిద్ర పోయేందుకు సహాయపడుతుంది. అలా చేయటం వల్ల నిద్రలో కలిగే మార్పు మీకే తెలుస్తుంది. భారత దేశంలో ఉత్తర దిక్కువైపు తలా పెట్టి నిద్ర పోకూడదు. అలా చేస్తే రక్త ప్రసరణ తలలోకి ఎక్కువ జరుగుతుంది. అయస్కాంతకర్షణ శక్తి కారణంగా ఇలా జరుగుతుంది. తలలో రక్త ప్రసరణ ఎక్కువగా జరగటం వలన నిద్రలో సమస్యలు కలుగుతాయి.అంతేకాకుండా శరీరానికి ఇది మంచిది కాదు.
పడుకునే ముందు ఒక పదినిమిషాలు ధ్యానం చేయటం చాలా మేలు చేస్తుంది. ఒక 5 నిముషాల పాటు ఆ రోజు జరిగిన మంచి విషయాలని తలుచుకుని మనస్సుని ఉల్లాస పరచటం వల్ల మంచి గాఢ నిద్రలోకి వెంటనే జారుకుంటారు. బాధ కలిగించే విషయాలని ఆలోచనలోకి రానివ్వకండి, వచ్చినా వాటి గురించి అతిగా ఆలోచించకండి. ఇలా చేయటం మొదట్లో కుదరకపోయినా తొందరగానే అలవాటు చేసుకుంటారు. అంతా మన మంచికే అని సంతృప్తి పడటమే మనిషి ఆచరించాల్సిన నియమం.
వాస్తవానికి నిద్ర పట్టాలంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అవసరమవుతుంది. నిద్ర బాగా పట్టేందుకు తీసుకోవాల్సిన పదార్థాలలో అరటిపండ్లు ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం, మెలటోనిన్ మరియు సెరోటోనిన్ అనే పోషకాలు శరీరానికి అందటం వల్ల మంచి నిద్ర పడుతుందని అనేక పరిశోధనలలో తేలింది. అరటిపండు తొక్కని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని రాత్రి భోజనం చేసేముందు ఒక గ్లాసు తీసుకుంటే ఒక వారం రోజుల్లో నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
రాత్రి పడుకునే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు స్వీకరించటం మంచి నిద్రకు దోహదపడుతుంది. అలానే ఒక కప్పు పెరుగుని తినటం వల్ల కూడా మంచి నిద్రని సొంతం చేసుకోవచ్చు. రాత్రి భోజనంలో ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోండి. అలానే బాదం, పిస్తా, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలను తినటం ద్వారా కూడా సుఖ నిద్రని పొందవచ్చు. ఇలాంటి మార్గదర్శకాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటిని పాటించటంతో శరీరానికి కావాల్సిన నిద్రని అందించి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటంతో ఆనందంగా జీవించవచ్చు.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.