ఉక్కు నగరం విశాఖపట్టణం త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అవతరించబోతుంది. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సీటీ హోదాలో నగరం హంగులు అద్దుకుంటోంది. తాజాగా పరిపాలనా రాజాధానిగాను ప్రకటించడంతో విశాఖ దేశంలోమరో గొప్ప నగరంగా రూపం మార్చుకోబోతుంది. శాసనమండలి మూడు రాజధానుల బిల్లుపై అడ్డు తగలకపోయుంటే? ఇప్పటికే విశాఖ అభివృద్ది పనులు ప్రారంభమయ్యేవి. అయినా ఆ బిల్లుతో సంబంధం లేకుండా కార్పోరేట్ కంపెనీలు విశాఖకు జోరుగా తరలి వస్తున్నాయి. మొదటి విడతగా 500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
తద్వారా వేల మందికి ఉఫాది దొరకుతుంది. ఇక మెట్రో రైలు పనులు త్వరిగతిన పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ (పూర్తి కావాల్సిన) ఎయిర్ పోర్టువరకూ మెట్రో సౌకర్యం ఉంది. ఇప్పటికే సిటీ ఫరదిలో ప్లైఓవర్లు దాదాపు పూర్తయ్యాయి. కొత్త రోడ్ల నిర్మాణం షర వేగంగా జరుగుతోంది. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ర్టీ విశాఖలో అభివృద్ది పరచడానికి పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సాగరతీరాన్ని అనుకుని ఉన్న స్థలాల్లో పెద్ద ఎత్తున స్టూడియో నిర్మాణాలు, పర్యాటక ప్రదేశాలు తీర్చి దిద్దాలని జగన్ సర్కార్ ప్లాన్ లో ఉంది. టాలీవుడ్ పెద్దలకు విశాఖ తీరం వెంబడి భారీ ఎత్తున స్థలాలు ఉండటం అభివృద్ధికి కలిసొచ్చే అంశంగా మారింది.
అయితే ఇలాంటి సమయంలో విశాఖను ఎల్ జి పాలిమర్స్, హెచ్ పీసీఎల్, ఫార్మా కంపెనీలు అంతే బెంబేలెత్తిస్తున్నాయి. ఎల్ జీ పాలిమర్స్, హెచ్ పీసీఎల్ లాంటి కంపెనీలు సరిగ్గా జనావాసాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఎల్ జీ ఘటనతో విశాఖలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. తాత్కలికంగా కంపెనీ మూతపడినప్పటికీ మళ్లీ పున ప్రారంభం అవుతుందా? లేక అక్కడ నుంచి ఫార్మా సిటీకి తరలిస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే గాజువాకకు అత్యంత సమీపంలో ఉన్న హెచ్ పీసీఎల్ కంపెనీలోనూ అప్పుడప్పుడు చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో స్థానికులు ఎప్పటికప్పుడు భయాందోళనకు గురవుతుంటారు. ఆ కంపెనీని ఆ ప్రాంతం నుంచి తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇక పరవాడ ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీ గా పేరుగాంచింది. కొన్ని వందల ఫార్మా కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు రియాక్టర్లు పేలడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలే ఇవన్నీ. ఈ ఘటనలపై ఇప్పటికే అనకాపల్లి, అచ్యుతాపురం సహా స్థానిక గ్రామాల వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చుతోన్న జగన్ సర్కార్ ఈ అంశాలన్నింటిపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. లేదంటే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కంపెనీల అనుమతులు, సెప్టీ, పొల్యుషన్ కు సంబంధించి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రక్షాళన చేపట్టాలి. అనుమతులు లేని కంపెనీలు మూసేయాలి. అయితే దీనికి సంబంధించి సీఎం జగన్ ప్రత్యేకంగా అధికారులతో నిఘా ఏర్పాటు చేయనున్నారని ప్రభుత్వ వర్గాల సమచారం. అంతకు ముందే పరవాడ ఫార్మా సిటీపై అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకోనున్నారని తెలిసింది. భద్రత, లోపాలకు సంబంధించి ప్రతీ కంపెనీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం.