Pawan : ‘హానికరం’ ఎవరో ప్రజలే తేల్చుతారు పవన్ కళ్యాణ్.!

Pawan : సినిమాటిక్ డైలాగులు పేల్చడంలో ఈ మధ్య పవన్ కళ్యాణ్ తాను వెరీ వెరీ స్పెషల్ అనిపించుకుంటున్నారు రాజకీయ తెరపై. సినిమాల్లో పేలే డైలాగులు వేరు, రాజకీయాల్లో పరిస్థితులు వేరు. వైసీపీ పాలన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఒకవేళ పవన్ చెప్పింది నిజమే అయి, వైసీపీ పాలన హానికరం.. అని భావిస్తే, రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపేస్తారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించిన ప్రజలకు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనుకుంటే అది పెద్ద కష్టమేమీ కాదు.

కానీ, ప్రజాభిప్రాయమెలా వుంది.? రాష్ట్రంలో విపక్షం పరంగా ఏర్పడ్డ పొలిటికల్ వాక్యూమ్‌ని జనసేన ఎంతవరకు రాజకీయంగా క్యాష్ చేసుకోగలుగుతోంది.? అన్నది జనసేన అధినేత బేరీజు వేసుకోవడం మంచిది.

స్థానిక ఎన్నికల్లో జనసేన ‘మమ’ అనిపించింది. టీడీపీ చేతులెత్తేసింది. అధికార వైసీపీ మాత్రం తన బలాన్ని చాటుకుంది. సో, రాష్ట్రానికి వైసీపీ పాలన ఆరోగ్యకరమేనని ప్రజలు తీర్పునిచ్చారని అనుకోవాలి. విపక్షాల్ని పూర్తిగా ప్రజలు పక్కన పెట్టారంటే, ఆ విపక్షాలే రాష్ట్రానికి హానికరమని ప్రజలు భావించారని అనుకోవాలేమో.

సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. మరీ, ‘హానికరం’ అనే మాటల్ని జనసేన అధినేత సినిమాటిక్‌గా చెప్పారు గనుక.. జనసేన గురించి ఇలాంటి చర్చ రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతోంది. బలమైన విపక్షంగా ఎదగాలనుకుంటున్నప్పుడు, అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు.. పవన్ కళ్యాణ్, ప్రజల్లో వుండాలి.

ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల సమస్యల తరఫున పవన్ బలంగా నిలబడితే, పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఆరోగ్యకరం.. అని ప్రజలు భావిస్తే, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆస్కారమేర్పడుతుంది.