శ్రియ తల్లి అయ్యిందట.. అరరె, చెప్పకుండా ఎలా.?

లాక్ డౌన్ సమయంలోనే శ్రియ తల్లి అయ్యిందట. శ్రియ, ఆండ్రీ కొశ్చీవ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ అమ్మాయి జన్మించింది. అయితే, శ్రియ ఎక్కడా తన బేబీ బంప్ ఫొటోల్ని పెట్టకపోవడమేంటని కొందరు గుస్సా అవుతున్నారు. ‘అసలు ఆ విషయమే చెప్పేలేదే.?’ అంటూ నసుగుతున్నారు.

ఇక, శ్రియ విషయానికొస్తే, తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘ఇష్టం’. సక్సెస్, ఫెయిల్యూర్ అన్న లెక్కలతో సంబంధం లేకుండా శ్రియ, తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. తమిళంలోనూ, హిందీలోనూ సినిమాలు చేసింది, విజయాలు అందుకుంది.

పెళ్ళయ్యాక కూడా శ్రియ సినిమాల్లో నటించడమే కాదు, స్టార్‌డమ్ కొనసాగిస్తుండడం గమనార్హం. కాగా, లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన శ్రియ, అక్కడి నుంచే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుండేది. అయినా, ఎక్కడా ఆమె బేబీ బంప్ బయటపడకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
కాగా, శ్రియ తాజాగా తాను తల్లినయిన విషయాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించింది. అందులో శ్రియ బేబీ బంప్.. ఆమె భర్త, ఆమె కూతురు వున్న వీడియో బైట్స్ కనిపిస్తున్నాయి.