ఈటెల రగడ: హరీష్ రావు అడ్డంగా బుక్కయిపోతారా.?

Etela Episode

Etela Episode

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారంలోకి మంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. నిజానికి హరీష్ రావు తెరవెనుక పావులు కదపడంతోనే ఈటెల రాజేందర్, కేసీఆర్ మంత్రి వర్గం నుంచి తొలగింపబడ్డారనే ప్రచారం కొన్ని రోజుల క్రితం జరిగింది. అయితే, ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితిలో మరో కీలక నేత చక్రం తిప్పారన్న వాదన ఇప్పుడిప్పుడే గట్టిగా వినిపిస్తోంది. ఈ ఊహాగానాల్లో నిజమెంతోగానీ, ఈటెల రాజేందర్ అంటే ఉద్యమ నాయకుడు. ఆయన మీదకి ఎవర్ని ఎగదోసినా తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం, తగిన సానుకూల ఫలితం రాబట్టే అవకాశం కన్పించడంలేదు.

ఈ నేపథ్యంలో హరీష్ రావుని రంగంలోకి దించాలని గులాబీ బాస్.. అదేనండీ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిసైడ్ అయ్యారట. హరీష్ రావు ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోతుందనే చర్చ గులాబీ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అత్యం చాకచక్యంగా ఈటెల రాజేందర్ వివాదాన్ని హరీష్ రావు అయితేనే చక్కదిద్దగలరన్నది కేసీఆర్ ఆలోచన అట. అయితే, హరీష్ రావు ఈ వ్యవహారంలో తలదూర్చడం మంచిది కాదన్న భావన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ‘హరీష్ భుజాలపై తుపాకీ పెట్టి, ఈటెల రాజేందర్ మీద అస్త్రం ప్రయోగించడం సబబు కాదు..’ అనే భావన సోషల్ మీడియాలో హరీష్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కాగా, గతంలో హరీష్ రావు తన వద్ద పార్టీ అధినేతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారనీ, పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చోటు చేసుకున్న వింత పోకడల గురించి తనతో హరీష్ చర్చించేవారనీ ఈటెల రాజేందర్ తాజాగా బాంబు పేల్చిన విషయం విదితమే. నిజానికి, ఈటెలపై విమర్శలు చేయడానికి తగిన కంటెంట్ హరీష్ వద్ద వుండకపోవచ్చు. ఎందుకంటే, ఇద్దరూ ప్రజా బలంతో గెలిచిన నాయకులు.. పైగా, ఉద్యమ నాయకులుగా ముద్ర పడ్డవారే. నిజానికి, ఈటెలపై కొందరు గులాబీ నేతలు విమర్శలు చేయడాన్ని చాలామంది గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, అధినేత కేసీఆర్ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయక తప్పదు గనుక.. వారంతా ఈటెలపై తూతూ మంత్రం విమర్శలతో సరిపెట్టాల్సి వస్తోంది.