ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మీద జనం ఒత్తిడి లేదు కానీ పార్టీ శ్రేణులు, నాయకుల ఒత్తిడే అధికంగా ఉంది. ఏదో ఒకటి చేసి పడుకున్న పార్టీమి నిద్ర లేపమని అందరూ గోల గోల చేస్తున్నారు. అసహనం పెరిగిపోయిన కొందరైతే ఆయన హైదరాబాద్లో మకాం పెట్టుకుని కూర్చుంటే ఇక్కడ పార్టీ ఎలా బాగుపడుతుంది, ఇలా అయితే వచ్చే ఎన్నికలు కాదు కదా ఆపై వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడం కష్టం అంటూ నిష్టూరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా చంద్రబాబు మాత్రం రియాక్ట్ కావట్లేదు. మౌనంగా చూస్తూ, వింటూ ఉన్నారు తప్ప ఒక్క మాట కూడ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఆయన మనసులో మాత్రం వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవడం ఖాయమనే గట్టి నమ్మకం ఉందట.
నమ్మకం ఉండటం మంచిదే కానీ ఆ నమ్మకం నిలబడాలంటే గట్టి ప్రయత్నం ఉండాలి కదా. కానీ అంత గట్టి ప్రయత్నం అక్కర్లేదనేది చంద్రబాబుగారి స్వగతమని చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు కొందరు. ఎందుకంటే వైసీపీకి ఉన్న బలానికి బయటి నుండి ఏం చేసినా ప్రయోజనం ఉండదని, ఏం జరిగినా ఆ పార్టీ లోపలే జరగాలని బాబుగారి అంచనా. మరి పార్టీ లోపల ఏమైనా జరుగుతోందా అంటే జరుగుతుందనే అంటున్నారట. వైసీపీ బయటకి 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా కనిపించినా అంతకుమించిన అసంతృత్తితో ఇబ్బందిపడుతోందట. వైసీపీలో లెక్కకు మించినంతమంది లోకల్ లీడర్లు ఉన్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరినవారు కొందరైతే చాలాకాలం నుండి ఉన్నవారు ఇంకొందరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ గెలిస్తే మనకు తిరుగే ఉండదని భావించి వారంతా శక్తికి మించి పనిచేసి పార్టీని గెలిపించారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక పొందాల్సిన పదవులు, ఇతర ప్రయోజనాలు వాటికవే వచ్చిపడతాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అందరూ ఎండిపోయి ఉన్నారు. దీంతో వారంతా ఆర్థికంగా, మిగతా అన్ని రకాలుగా పార్టీ కోసం సర్వస్వం ధారబోస్తే ఒట్టి చేతులే మిగిలాయని అసంతృప్తితో ఉన్నారట. ఎప్పటికైనా ఆ అసంతృప్తులే వైకాపాను దెబ్బకొడతారని, జగన్ కూడ వాళ్ళను ఆపలేరని, మనం చేయాల్సిందల్లా ఆ సమయం కోసం ఎదురుచూడటమేనని బాబుగారు భావిస్తున్నారట. అందుకే నింపాదిగా నడుస్తున్నారట. మరి వినడానికి అసాధ్యమనిపిస్తున్న ఈ చేతులు కట్టుకుని చూసే ఈ థియరీ బాబుగారు అనుకుంటున్నట్టు నిజంగానే వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.