గత ఎన్నికల్లో టీడీపీ ఊహించని రీతిలో పరాభవాన్ని చవిచూసింది అంటే అందుకు జగన్ ఛరీష్మా కంటే పార్టీలోని అంతర్గత కలహాలే కారణమని అనాలి. జిల్లాస్థాయి నేతల్లో సహకారం సక్రమంగా లేకపోవడమే గెలవాల్సిన చోట కూడ పార్టీ కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. టీడీపీకి, వైసీపీకి మధ్యన ఓట్ షేర్ తేడా 10 నుండి 11 శాతం మాత్రమే. ఈ పది శాతానికే వైసీపీ 151 సీట్లు, టీడీపీ 23 సీట్లు అనే భారీ వ్యత్యాసంతో ఫలితాలు వచ్చాయి. ఇక ఈ ఓట్ షేర్ తేడా ఎందుకొచ్చిందో విశ్లేషించుకున్న చంద్రబాబుకు ఆ ఘనకార్యం తమ పార్టీ నేతల పుణ్యమేనని తెలిసొచ్చింది.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చాలామంది తమ నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలను పట్టించుకున్న పాపన పోలేదు. వీరిలో సీనియర్ నాయకులు కూడ ఉన్నారు. అన్నీ తెలిసిన వారే సమిష్టితనానికి తిలోధకాలు వదిలితే పెద్దగా అనుభవంలేని మిగతా ఎమ్మెల్యేలు ఎన్ని పొరపాట్లు చేసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేతిలో ఉన్నా పనులు చేయకపోవడం, చుట్టూ సొంత కోటరీని పెట్టుకుని క్రీయాశీలకంగా పనిచేసేవారిని పట్టించుకోకపోవడం, మరీ ప్రధానంగా ఎన్నికల నాటికి ఆర్ధిక, ఇతర బాధ్యతలు అప్పగించే విషయమై సొంతవారిని తప్ప పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నవారిని నమ్మకపోవడంతో మౌనంగానే తిరుగుబాటు మొదలైంది.
ఎన్నికలకు సరిగ్గా నాలుగైదు నెలల ముందు మొదలైన ఈ ముసలాన్ని చంద్రబాబు నాయుడు సైతం గుర్తించలేకపోయారు. అందుకే ఎన్నికల్లో పార్టీ కుప్పకూలిపోయింది. నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాలో కనబడకుండా పోయింది. సరే ఎన్నికల చేదు అనుభవం తర్వాతైనా నేతలు మారారు అంటే లేదు. ఇప్పటికీ అదే దూరం, అదే పంతం. కలిసి పనిచేద్దామనే యావ లేదు. అందుకే చంద్రబాబు పార్లమెంటరీ ఇంఛార్జిల నియామకంలో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎక్కడైతే కీలక నేతలు సఖ్యత లేకుండా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారో అక్కడో కొత్తవారితో మందు వేశారు.
ఇద్దరు నేతలు పదవి కోసం కొట్టుకుంటుంటే అనూహ్యంగా మూడవ వ్యక్తిని తెర మీదకి తెచ్చి మీ ఇద్దరికీ ఇవ్వట్లేదు, ఇదిగో ఇతనే కొత్త ఇంఛార్జ్ అంటూ పంచాయితీని ముగించారు. అందుకు ఉదాహరణే విజయనగరం ఇంఛార్జ్ కిమిడి నాగార్జున. పెద్దవాళ్ళు ఇద్దరూ కొట్టుకుంటే సర్దిచెబుతూ కూర్చునే సమయం తనకు లేదని, అందుకే కొత్తవాళ్ళని ప్రవేశపెట్టానని, ఇకపైనైనా కలిసి ఉంటే మేలని లేకుంటే ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని నేరుగానే చెప్పేశారట. దీంతో రగిలిపోయిన కొందరు నేతలు కొత్త ఇంఛార్జుల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. దానికి కూడ బాబుగారి దగ్గర ఏదో ఒక మందు ఉండే ఉంటుంది.