బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతలా పాకులాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా ఈదడం కష్టమని అర్థం చేసుకున్న ఆయన తోడు కోసం తహతహలాడిపోతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని శతకోటి విద్యలను వాడేస్తున్నారు. ముందుగా 2024లో అధికారంలోకి రావాలంటే మనం కలవాల్సిందే అన్నట్టుగా వ్యవహరించిన బాబు ఆ తర్వాత బీజేపీ మాటలకు వంతపాడటం మొదలెట్టారు. సోము వీర్రాజు సహా బీజేపీ నేతలు ఏం మాట్లాడినా బలపరుస్తూ వచ్చారు.
ఒకానొక దశలో సొంత నిర్ణయాలను మానేసి బీజేపీ ఎటు వెళితే అటు వెళ్లడం, ఏ అంశం మీద మాట్లాడితే దాన్నే పట్టుకోవడం, వాళ్ళే పోరాటం స్టార్ట్ చేస్తే దానిలో కలిసిపోవడం చేస్తూ వచ్చారు. ఇన్ని చేసినా కమలనాథులు మాత్రం మెత్తబడలేదు. ఆరు నూరైనా నూరు నూటయాభై అయినా బాబుకు బీజేపీ గేట్లు తెరుచుకోవని స్పష్టం చేశారు. దీంతో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను ఆయుధంగా వాడుతున్నారట చంద్రబాబు.
పొత్తుకు ఒప్పుకుంటే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టమని, బీజేపీ అభ్యర్థికే మద్దతిచ్చి గెలిపిస్తామని అంటున్నారట. ఈ మాటలకు సర్దుకుపోయి స్నేహం చేస్తే మాత్రం బీజేపీ పప్పులో కాలేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే తిరుపతి లోక్ సభ స్థానంలో టీడీపీకి గానీ బీజేపీకి గానీ స్పష్టమైన ఆధిక్యత లేదు. 1984లో టీడీపీ అక్కడ విజయం సాధిస్తే 1999లో బీజేపీ గెలిచింది. అలా చేరొక్కసారి మాత్రమే ఆ స్థానాన్ని గెలవగలిగారు. ఇక మిగతా అన్ని దఫాల్లో కాంగ్రెస్ గెలవగా ఆ తర్వాత వరుసగా వైసీపీకి చివరి రెండుసార్లు గెలిన ట్రాక్ రికార్డ్ ఉంది.
అంతెందుకు 2014లో పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీల కూటమి నుండి బీజేపీ నేత కారుమంచి జయరాం పోటీచేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు. పైగా అప్పుడున్నవి అనుకూల పరిస్థితులే. అలాంటప్పుడే గెలవలేకపోయిన వారు ఇప్పుడు స్పష్టంగా వైసీపీ గాలి వీస్తోంది, అన్నిటినీ మించి సానుభూతి అంశం అనేది ఒకటుంది. అది తప్పకుండా పనిచేసి తీరుతుంది. ఇన్ని ప్రతికూలతలు మధ్య బీజేపీ, టీడీపీలు ఒంటరిగా నిలబడినా పెనవేసుకుని నిలబడినా వైసీపీని కొట్టడం ముమ్మాటికీ అసాధ్యం.