హామీలు ఇచ్చి మోసం చేయడంలో, వాటిని పట్టించుకోకపోవడంలో రాజకీయ నాయకులు ముందుంటారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఇష్టమొచ్చిన హామీలు ఇస్తారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే హామీలనే కాదు ప్రజలను కూడా పట్టించుకోరు. ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి అలానే ఉంది. చంద్రబాబు నాయుడు హయంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం అక్కడి రైతులు కొన్ని వందల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు.
ఇక్కడ రాజధాని వస్తే తమకు మంచి జరుగుతుందని భావించిన రైతులకు 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి మొండి చెయ్యి చూపించారు. అప్పుడు అమరావతి నిర్మాణానికి జగన్ మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. అదే సరైన నిర్ణయమని, తాను ఇప్పటికే అమరావతిలో ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం కూడా తాను కృషి చేస్తానని చెప్పిన ఇప్పుడు మూడు రాజధానుల అంశంతో వల్ల అమరావతి రైతుల ఆశలపై నీళ్లు పోశారు.
మూడు రాజధానుల అంశం వచ్చిన్నప్పటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్యమాలు చేస్తూ అమరావతి రైతులకు అండగా నిలిచారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మొదటి నుండి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అమరావతి విషయంలో వెనక్కి తగ్గాడు. కొన్ని రోజుల క్రితం తాము రాజధాని విషయంలో కల్పించుకోలేమని బీజేపీ చెప్పినప్పటి నుండి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిపై శ్రద్ధ తగ్గించారు. అమరావతి భూముల విషయంలో జరిగిన మొసలి గురించి వైసీపీ నేతలు ఆధారాలతో సహా మాట్లాడుతుండటం వల్ల ఇంకా ఈ విషయాన్ని సాగదిస్తే తమకే హాని అని భావించిన టీడీపీ నేతలు ఇప్పుడు అమరావతి అంశాన్ని పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకు అమరావతిలోనే రాజధాని ఉండాలని ధర్నాలు చేసిన బీజేపీ నేతలు, హై కోర్ట్ లో కేంద్రం చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అమరావతి రైతులను పట్టించుకోవడం లేదు. జనసేన ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది. రాష్ట్రంలో వచ్చిన ఈ తాజా రాజకీయ పరిణామాల వల్ల అమరావతి రైతులు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణాల వల్ల రైతులే నష్టపోతున్నారు.