టాలీవుడ్ నిర్మాతకి చుక్కలు చూపిస్తున్న తమిళ హీరో.!

తెలుగు హీరోలు వేస్టు, తమిళ హీరోలు బెస్టు.. అనుకుంటున్నారా.? ఏమోగానీ, తమిళ హీరోలతో తెలుగు నిర్మాతల సినిమాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి.

ఓ ప్రముఖ తెలుగు నిర్మాత, ఓ ప్రముఖ తమిళ హీరోతో సినిమాకి రంగం సిద్ధం చేశాడు. సినిమా షురూ అయ్యింది. కానీ, అసలు కథ ఇక్కడే మొదలయ్యింది.

ద్విభాషా చిత్రం.. కాదు కాదు, పాన్ ఇండియా సినిమా అయినా.. ఒకింత తెలుగుదనంతో కూడిన సబ్జెక్టు అట అది. దాంతో, తెలుగు నేటివిటీ కాస్త ఎక్కువ వుండేలా నిర్మాత, దర్శకుడు కలిసి ప్లాన్ చేస్తే, తమిళ నేటివిటీ కోసం పట్టుబడుతున్నాడట తమిళ హీరో.

అక్కడికీ, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా చాలా మార్పులు చేసినా, ఇంకా ఇంకా మార్పులు కోరుతున్నాడట.. ఆ హీరో. ఆ గొంతెమ్మ కోర్కెల పట్ల తెలుగు నిర్మాత ఒకింత.. కాదు కాదు, చాలా చాలా బాధపడాల్సి వస్తోంది.

కథ మొత్తం మారిపోతోందంటూ దర్శకుడూ గగ్గోలు పెడుతున్నాడట. ఇప్పటికే ఖర్చు కూడా తడిసి మోపెడయ్యిందని అంటున్నారు. అయినా, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్నప్పుడు.. ఈ నేటివిటీ పంచాయితీ ఏంటో.? పైగా, తమిళ నటీనటులు, టెక్నీషియన్ల డామినేషన్ కూడా ఎక్కువైపోయిందట.!