Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశంపై తీవ్ర దుమారం చెలరేగింది. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయగా, చిరంజీవిపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా పెద్దలు అప్పటి సీఎం జగన్‌ను కలిసిన వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులను జగన్ గేటు వద్దే ఆపేశారని, చిరంజీవి గట్టిగా నిలదీయడంతోనే జగన్ దిగివచ్చి మాట్లాడారని కామినేని పేర్కొన్నారు. అయితే కామినేని వ్యాఖ్యలు అబద్ధమని బాలకృష్ణ కొట్టిపారేశారు. వైఎస్ జగన్‌ను ఆ సమయంలో ఎవరూ గట్టిగా అడగలేదని స్పష్టం చేశారు.
”జగన్ పతనం ఖాయం’ ఈడీ కేసుల్లో జైలు శిక్ష ఖాయం – గోరంట్ల బుచ్చయ్య చౌదరి”
ఈ సందర్భంగా బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా ‘సైకో’ అని సంబోధించడం తీవ్ర దుమారానికి కారణమైంది. జగన్ సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదన్న కామినేని వ్యాఖ్యల నేపథ్యంలో, చిరంజీవి గట్టిగా నిలదీయలేదని బాలకృష్ణ పరోక్షంగా పేర్కొనడం గమనార్హం.
అదే సమయంలో, అధికారంలోకి వచ్చిన ప్రస్తుత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపైనా బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) సమావేశంలో తన పేరును 9వ స్థానంలో చేర్చడం తనను అవమానించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జాబితా తయారు చేసింది ఎవరని ప్రశ్నించారు. తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి అడిగినట్లు కూడా సభలో బాలకృష్ణ వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.

