సాయిపల్లవితో నటించాలంటే భయం : చైతన్య

టాలీవుడ్‌ అగ్ర కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. భానుమతి హైబ్రిడ్‌ పిల్లా అంటూ ‘ఫిదా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులను దోచుకుంది ఈ భామ. అనంతరం ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్‌ స్టోరీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘విరాట పర్వం’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

ప్రస్తుతం నాగ చైతన్యతో ‘తండేల్‌’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే రీసెంట్‌గా ఒక టాక్‌ షోలో పాల్గొన్న నాగ చైతన్య సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దగ్గుబాటి హోస్ట్‌గా చేస్తున్న టాక్‌ షో ది రానా దగ్గుబాటి షో. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతున్న ఈ షోలో రీసెంట్‌గా నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చాడు.

అయితే షోలో భాగంగా రానా సాయి పల్లవి గురించి అడుగగా.. చైతూ మాట్లాడుతూ.. సాయిపల్లవితో నటించాలన్నా.. డాన్స్‌ చేయాలన్నా భయం వచ్చేస్తది బావ (రానా). నువ్వు సాయిపల్లవితో ‘విరాట పర్వం’ సినిమా చేసి ఒక్క సాంగ్‌ కూడా పెట్టకుండా భలే తప్పించుకున్నావు. కానీ నాకు అలా లేదు తనతో చేసేటప్పుడు నేను బానే చేస్తున్నానా అని సందేహం వస్తుంది అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్‌గా మారింది.