Cricket: బన్నీహాప్ క్యాచులపై నిషేధం.. ఎంసీసీ కొత్త రూల్స్ ఇవే..!

అంతర్జాతీయ క్రికెట్‌లో మేరీలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలకమైన మార్పును తీసుకొచ్చింది. బౌండరీ దగ్గర క్యాచ్‌ల విషయంలో కొత్త నియమాలను ప్రకటిస్తూ, వచ్చే నెల నుంచి ఇవి అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకున్న ఫీల్డర్ ఒక్కసారిగా బౌండరీ బయటికి దూకితే, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని టచ్ చేసిన తరువాతే దానిని క్యాచ్‌గా పరిగణిస్తారు. లేకపోతే అది క్యాచ్ కాదు, బౌండరీగానే పరిగణిస్తామని ఎంసీసీ స్పష్టం చేసింది.

ఈ రూల్‌కి “బన్నీ హాప్ నిషేధం” అనే పేరు కూడా పెట్టారు. బౌండరీ లైన్ అవతల నిలబడి బంతిని మైదానంలోకి విసరడం ఇకపై నిషేధమని స్పష్టం చేశారు. అంటే, మైదానానికి బయటి నుంచి బంతిని టచ్ చేసి లోపలికి విసరడాన్ని ఇక మానేయాలి. అయితే, ఓ ఫీల్డర్ బంతిని టచ్ చేసే సమయంలో మైదానంలోనే ఉంటే, ఆ తర్వాత గాల్లోకి విసరడంతో పాటు బౌండరీ లైన్ దాటి వెళ్లినా, మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్ పూర్తి చేస్తే అది ఔట్ గా పరిగణిస్తారు.

ఈ మార్పుకు కారణంగా బిగ్ బ్యాష్ లీగ్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన నిలిచింది. 2023లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన మైఖేల్ నెజెర్, బౌండరీ దగ్గర ఓ అసాధారణ క్యాచ్ అందించాడు. తొలుత బంతిని పట్టుకొని బౌండరీ దాటి వెళ్ళాడు. గాల్లోకి బంతిని విసిరి మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పటి నిబంధనల ప్రకారం అది అవుటే అయినప్పటికీ, ఈ తరహా క్యాచ్‌లపై సాంకేతిక, నైతిక ప్రశ్నలు వచ్చాయి. దాంతో ఎంసీసీ నిబంధనల్లో స్పష్టత తీసుకువచ్చింది.

ఈ కొత్త నియమాలు అందరికీ స్పష్టంగా ఉండేలా, ఆటతీరు మరింత న్యాయంగా ఉండేలా తీసుకొచ్చామని ఎంసీసీ తెలిపింది. క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు ఇప్పుడు ఈ నూతన మార్పుల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.