దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారిపోయే లెక్కలు.. ఆద్యంతం కిక్కే కిక్కు. దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. సెప్టెంబర్ 14 రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో ఇరు జట్లు కీలక ఆటగాళ్లు లేకుండానే మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే యువ ఆటగాళ్లతో రెండు జట్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
ఇక ఈ మ్యాచ్‌ను కేబుల్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్ ద్వారా లైవ్‌లో చూడొచ్చు. అలాగే ఓటీటీలో సోనీ లీవ్ యాప్‌లో తిలకించవచ్చు. 1984లో ప్రారంభమైన ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌లు గెలవగా.. పాకిస్తాన్ 6 సార్లు గెలుపొందింది. వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
మరోవైపు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు బీసీసీఐ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కారణంగా పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటంపై భారత అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు హాజరైతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో బీసీసీఐ అధికారులు మ్యాచ్ వీక్షణకు హాజరుకాకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
పాక్‌తో మ్యాచ్ ఆడకుండా నిషేధించాలని భారత్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలో ఏ దేశమైనా పాల్గొనాలని.. లేదంటే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి పేర్కొన్నారు. మ్యాచ్‌లు ఆడకపోతే ఇతర జట్లకు పాయింట్స్ లభిస్తాయని గుర్తుచేశారు. పాక్‌తో భారత్ చాలా సంవత్సరాలుగా దైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదన్నారు. ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రదాడులు ఆపే వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండని మరోసారి స్పష్టం చేశారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా
పాకిస్తాన్ జట్టు: సల్మాన్ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, సయీమ్ అయూబ్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ మిర్జా, షాహీన్ షా అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, హారిస్ రౌఫ్, హసన్ అలీ
