రాత్రి 10కి ముందే.. లేదా మరీ ఆలస్యంగా నిద్రపోతున్నారా..? జర జాగ్రత్త..!!

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవన విధానం గురించి తెలిసిందే. ఒత్తిడి, ఆహారం, కాలుష్యం.. వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. కొందరు అర్ధరాత్రి 12 దాటితే గానీ నిద్రపోరు. ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఒంటిగంట, రెండు దాటినా ఆశ్చర్యపోనవసం లేదు. ఇలా నిద్రపోకుండా మెలకువగా ఉంటూ నిద్రకు దూరమవుతున్నారు. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా తొమ్మిది తర్వాత పది లోపే నిద్రకు ఉపక్రమించే వారూ ఉన్నారు. అయితే.. రీసెంట్ గా ఓ సర్వేలో దీనిపై కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందులో రాత్రి 10 గంటలకు ముందే నిద్రపోయేవారిలో హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య ఎక్కువగా ఉందని తేలడం షాక్ ఇస్తోంది.

21 దేశాల్లో దాదాపు 5633 మంది మరణాల మీద కొందరు సైంటిస్టులు చేసిన సర్వే ఆధారంగా ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర, ఒత్తిడి, పని తదితర అంశాల ఆధారంగా ఈ సర్వే చేశారు. ఈ క్రమంలోనే రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారిలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 9 శాతం ఎక్కువని తేలిందట. ఇదే అంశాన్ని సైంటిస్టులు ఓ మెడికల్ జర్నల్ స్లీప్ మెడిసిన్‌లో రాశారు కూడా. వీరిలో కొందరు తక్కువ చదువుకున్నవారు, మహిళలు, గ్రామీణ ప్రాంతవాసులు, పొగ తాగేవారు, మద్యం సేవించే వారు ఉన్నారు.

 

మనిషికి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల వరకూ నిద్ర అవసరం. అయితే.. ఏ సమయంలో నిద్రపోతున్నామనేది కూడా ముఖ్యమే అంటున్నారు సైంటిస్టులు. రాత్రి 10 నుంచి 12 మధ్య నిద్రకు ఉపక్రమించే వారిలో తక్కువ గుండె సమస్యలు కనిపించాయని అంటున్నారు. నిపుణులు చెప్తున్న ప్రకారం 10కి ముందే నిద్రకు వెళ్లినా.. బాగా లేట్ గా నిద్రపోయినా కార్డియాక్ రిథమ్ దెబ్బతింటుందని అంటున్నారు. నిద్రపై ఎవరికీ ఒక అంచనా ఉండదు. కొందరు మంచం మీద వాలగానే నిద్రపోతారు. మరికొందరు ఏ పుస్తకమో చదివితే కానీ నిద్రపోరు. మరికొందరు టీవీ చూస్తూ నిద్రలోకి వెళ్లిపోతారు. కాబట్టి.. నిద్రపై ఇటువంటి సమస్యలు ఉంటే ఒకసారి డాక్టర్‌ను కలిసి సలహాలు తీసుకోవడం ఉత్తమం.