నిద్రను నిర్లక్ష్యం చేస్తే.. వయస్సుకి మించిన వృద్ధాప్యం తప్పదంట..!

మనలో చాలా మంది నిద్ర తగ్గితే శరీరం అలసిపోతుందని.. పనితీరు మందగిస్తుందని మాత్రమే భావిస్తాం. కానీ తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ పరిశోధనలో నమ్మలేని నిజాన్ని బయటపెట్టింది. క్వాలిటీ లేని నిద్ర మన మెదడును మన వయస్సు కంటే వేగంగా ముసలిదిగా మార్చేస్తుందని ఈ అధ్యయనం హెచ్చరించింది.

ప్రపంచ ప్రఖ్యాత కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు UK బయోబ్యాంక్‌లోని 27,500 మంది మధ్య వయస్కులు, వృద్ధుల డేటాను విశ్లేషించారు. మెషిన్ లెర్నింగ్, ఆధునిక MRI ఇమేజింగ్‌ల సహాయంతో 1,000కిపైగా మెదడు లక్షణాలను అధ్యయనం చేసి, ప్రతి వ్యక్తి బయోలాజికల్ బ్రెయిన్ ఏజ్‌ను కొలిచారు. ఫలితాలు ఆశ్చర్యపరిచే విధంగా వచ్చాయి.

సరిగ్గా నిద్రపోని వారి మెదడు, వారి నిజమైన వయస్సు కంటే సగటున ఒక సంవత్సరం పెద్దదిగా కనిపించింది. స్లీప్ క్వాలిటీ స్కోర్ ఒక్క పాయింట్ పడిపోతే, మెదడు వయస్సు-అసలు వయస్సు మధ్య గ్యాప్ దాదాపు ఆరు నెలలు పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ ప్రభావం అలాగే కొనసాగింది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు పాల్గొన్నవారిని ఐదు ముఖ్యమైన అంశాల ఆధారంగా అంచనా వేశారు.. ఉదయం త్వరగా లేస్తారా లేదా ఆలస్యంగా పడుకుంటారా, రోజువారీ నిద్ర వ్యవధి ఎంత, ఇన్సోమ్నియా సమస్య ఉందా, గురక పెడతారా, పగటిపూట మత్తుగా అనిపిస్తుందా అన్నది. సమాధానాల ఆధారంగా వారిని మంచి నిద్రపోయేవారు, సగటు నిద్రపోయేవారు, సరిగ్గా నిద్రపోనివారు అనే మూడు వర్గాలుగా విభజించారు.

ఇక ఈ సంబంధానికి కారణం కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్ అని పిలిచే శరీరంలో తక్కువ స్థాయి వాపు నిద్రలేమి కారణంగా పెరుగుతుంది. ఈ వాపు 10 శాతం కంటే ఎక్కువగా మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని తేలింది. దీర్ఘకాలం ఇదే కొనసాగితే మెదడు కణజాలం దెబ్బతింటుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు కూడా ఇలాంటి వాపుతో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలాగే నిద్రలేమి రక్తప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలితంగా మెదడుకు ఆక్సిజన్, పోషకాలు సరఫరా తగ్గిపోతుంది. మధ్య వయస్సులో నిద్రపోయే సమయం కంటే స్లీప్ క్వాలిటీనే దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యానికి కీలకం అని పాత పరిశోధనలు కూడా నిరూపించాయి.

ఇక గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులోని వ్యర్థాలను తొలగించే ప్రత్యేక వ్యవస్థ యాక్టివ్‌గా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీనిని “బయోలాజికల్ క్లీనింగ్ సర్వీస్” అని పిలుస్తారు. ఇది పగటిపూట పేరుకుపోయిన విషపదార్థాలు, చెత్త ప్రోటీన్లను తొలగిస్తుంది. ఈ ప్రక్రియ జరగకపోతే వృద్ధాప్యం వేగంగా వస్తుంది. నిద్ర సమయం ఎంత ఉందన్నది కాకుండా, నిద్ర నాణ్యతే అత్యంత ముఖ్యమైంది. సరైన నిద్ర అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా మెదడు వృద్ధాప్యాన్ని నియంత్రించగలం” అని ప్రధాన పరిశోధకురాలు అబిగైల్ డోవ్ వివరించారు.

నిపుణుల సూచన ప్రకారం, ప్రతి రోజు 7–8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవడం, నిద్రకు ముందు స్క్రీన్ టైమ్ తగ్గించడం, రాత్రివేళ కాఫీన్ వాడకం నివారించడం, ఒకే సమయానికి పడుకోవడం వంటి చిన్న మార్పులు దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మొత్తానికి ఈ అధ్యయనం చెప్పే ఒక్క మాట.. నిద్రను తక్కువ అంచనా వేయొద్దు. సరిగ్గా నిద్రపోతేనే మెదడు ఆరోగ్యంగా.. యవ్వనంగా ఉంటుంది.