సాధారణ తలనొప్పికి భిన్నంగా తలలో ఒక పక్కన మాత్రమే తీవ్రమైన నొప్పి కలిగితే దానిని మైగ్రేన్ తలనొప్పి అంటారు. మైగ్రేన్ తలనొప్పి వస్తే కంటి పై భాగం నుదుటిపైన తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి వస్తే కొన్ని రోజులపాటు మనల్ని ఇబ్బంది పెడుతుంది. మైగ్రేన్ తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, ఆహార అలవాట్లు, వాతావరణ మార్పులు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మైగ్రేన్ తలనొప్పిని అదుపులో ఉంచాలంటే మొదట ఈ నొప్పి ఏ కారణం చేత వస్తుందో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి రావడానికి గల ముఖ్య కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మైగ్రేన్ తలనొప్పి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు అనేక సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు తలకు ఒక భాగంలోనే తీవ్రమైన నొప్పి వస్తుంది, తరచూ వాంతులు వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి, కాంతి,ధ్వని తీవ్రతను తట్టుకోలేరు, ఘాటైన వాసనలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మైగ్రేన్ తలనొప్పిగా భావించవచ్చు. మైగ్రేన్ సమస్య తలెత్తడానికి గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
మైగ్రేన్ తలనొప్పికి జన్యుపరమైన కారణాలతో అనేక కారణాలు ఉన్నాయి. అధిక వాతావరణ పీడనం ఉన్న ప్రదేశంలో ఎక్కువ రోజులు గడిపితే మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది. అలాగే ప్రకాశంవంతమైన లైట్లు, అధిక ధ్వని తీవ్ర తరంగాలు మధ్య పని చేసే వారిలో కూడా మైగ్రేన్ తలనొప్పి సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో మరియు ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ హెచ్చుతగ్గుల కారణంగా మైగ్రేన్ తలనొప్పి సమస్య తలెత్తుతుంది.
గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వినియోగించినా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అధిక మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, మద్యపానం ధూమపానం వంటి కారణాల వల్ల కూడా కొందరిలో ఈ మైగ్రేన్ తలనొప్పి సమస్య తీవ్రంగా ఉంటుంది.