మైగ్రేన్… తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా వస్తూ గంటల తరబడి తగ్గకుండా వేధిస్తుంటుంది. ప్రస్తుతం బిజీ జీవనశైలిలో ఒత్తిడి, నిద్రలేమి, ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి అంటే కొంతమందికి తలకు ఒక సైడ్ వస్తుంది కొంతమందికి రెండు వైపుల కూడా వస్తుంది.
పురుషులలో కన్నా మహిళలలో ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ వచ్చిన సమయంలో ఎక్కువ వెలుతురును, శబ్దాలను భరించలేరు. చికాకుగా ఉంటూ , కంటి చూపు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చనిపోవాలని అనిపించేంతగా మైగ్రేన్ బాధపెడుతుంది. ఈ క్రమంలో ముందుగా వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకుంటూ వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మైగ్రేన్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ప్రాణాయామం చెయ్యాలి. పొగ, ఆల్కహాల్ అలవాటున్నవారు వెంటనే మానుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకుని ఆరోగ్యపరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ కొంతసేపు వాకింగ్ చేయటం వల్ల ముప్పుని తగ్గించుకోవచ్చు.
అల్లం, తులసి, పుదీనాతో కాషాయం చేసుకుని త్రాగితే మైగ్రేన్ నుండి ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటూ రోజుకు నాలుగైదు సార్లు కొన్ని తులసి ఆకులను నమలండి. తద్వారా మీకు మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. రోజుకు నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు త్రాగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మైగ్రేన్ కు కారమయ్యే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మైగ్రేన్ రాకుండా ఉంటుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్, గుమ్మడికాయ గింజలను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఆకుపచ్చ ఆకు కూరలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి చాలా సహాయపడతాయి. బచ్చలికూరలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి, మెగ్నీషియం ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.