‘వర్మ’ పై చివరకు ఆ ముద్ర వేసేసారు టీడీపి వాళ్లు

నిజ జీవిత సంఘటనలను స్క్రీన్‌ మీద ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మది ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్‌ రిలీజ్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసారు. ఇంతకు ముందు సైతం ఇదే పద్దతిలో ‘రక్త చరిత్ర, వంగవీటి, 26/11 ఎటాక్స్‌’ తెరకెక్కించారు వర్మ. అంతేకాదు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సక్సెస్ ను ఎంజాయ్‌ చేస్తూ అప్పుడెప్పుడో వర్మ ప్రకటించిన శశికళ బయోపిక్‌ త్వరలోనే వస్తుందని తెలిపారు.

ఇక అవన్ని ఒకెత్తు అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో వైయస్ జగన్ కు చెందిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఆ పార్టీకు చేసే ప్రచారం ఇవన్నీ ఆయన్ను స్టార్ క్యాంపైనర్ గా పిలిచేలా చేస్తున్నాయి.

వర్మపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్లు విరుచుకుపడుతున్నారు. గతంలో ఆయనపై ఓ పెద్ద దర్శకుడుగా అభిమానం ఉండేదని, ఇప్పుడు ఓ పార్టి దగ్గర డబ్బు తీసుకుని ఇలా ప్రచారం చేయటంతో ఆయనపై గౌరవం పోయిందంటున్నారు. అయితే ఇలాంటివన్నీ వర్మ ఎప్పుడూ పట్టించుకోరు. హిట్ కొడితే తన చుట్టు ప్రపంచం తిరుగుతుందని, అభిమానులు ఆటోమేటిక్ గా తన వెంటే ఉంటారని ఆయన నమ్ముతారు.

ఇక రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలపై ఏప్రిల్‌ 3 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమా చూసిన తరువాత విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం గతంలోనే వెల్లడించింది. అయితే రిలీజ్‌ పై స్టే విధించటాన్ని చిత్రయూనిట్ సుప్రీం కోర్టులో చాలెంజ్‌ చేసింది. దీంతో విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమని, సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని హైకోర్టు న్యాయమూర్తులు కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేశారు.