ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని సంచలన ఘట్టం వాషింగ్టన్ డీసీలో చోటు చేసుకుంది. 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ డ్రా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిఫా తొలి ‘శాంతి బహుమతి’ను అందజేసింది. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో స్వయంగా ఈ అవార్డును ట్రంప్‌కు ఇచ్చారు.. ఈ కార్యక్రమం అంతర్జాతీయ రాజకీయాలు, క్రీడా ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఫుట్‌బాల్ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ఆలోచనతో ‘ఫుట్‌బాల్ యూనైట్స్ ది వరల్డ్’ అనే నినాదంతో ఈ కొత్త బహుమతిని ప్రవేశపెట్టినట్లు ఫిఫా ప్రకటించింది. శాంతి కోసం అసాధారణ కృషి చేసి, దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించిన వారికి ఈ పురస్కారం అందిస్తామని సంస్థ వెల్లడించింది. ట్రంప్ తన రెండో పదవీకాలంలో గాజా–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్–రష్యా చర్చలు, కొంగో–రువాండా వివాదాలు, అబ్రహం అకార్డ్స్ విస్తరణ, ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధాలను ఆపడంలో కీలక పాత్ర పోషించినట్లు ఫిఫా పేర్కొంది. లక్షల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ స్వయంగా చెప్పుకున్న వ్యాఖ్యలను కూడా ఫిఫా ప్రస్తావించింది.
కెన్నడీ సెంటర్‌లో రెండు వేల మంది ముందు అవార్డు స్వీకరించిన ట్రంప్.. ‘ఇది నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. 2026 ప్రపంచకప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరగనుందని, అది ప్రపంచమే చూడని స్థాయిలో ఉంటుందని చెప్పారు. అయితే ఈ అవార్డుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇది ట్రంప్ ఇగో కోసం సృష్టించిన ‘ఫేక్ ప్రైజ్’ అని కొందరు వ్యాఖ్యానిస్తే, ఫిఫా రాజకీయ రంగంలోకి దిగిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. గాజా, ఉక్రెయిన్‌లో యుద్ధాలు కొనసాగుతుండగానే శాంతి బహుమతి ప్రకటించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. #FIFAPeacePrize హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
