ప్రజలను ఆకట్టుకోవడంలో కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ఈ ఆకట్టుకోవడం కూడ సాదాసీదాగా కాదు ఎమోషనల్ గా ఆకట్టుకుంటారు. ఇదే తెరాసను అగ్రగామిగా నడుపుతున్న సాధనం. కేసీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి. తెలంగాణ ప్రజానీకం జరుపుకునే ఈ ప్రధాన పండుగను రాష్ట్ర పండుగగా మార్చి ఆరోజున ఆడపడుచులందరూ కొత్త బట్టలు వేసుకోవాలనే ఉద్దేశ్యంతో పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. మహిళల్లో తెరాస పట్ల అభిమానం పెరుగుతోంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ చీరల పంపిణీకి ఏర్పాటు చేశారు. సుమారు 300 కోట్లకు పైగా ఖర్చు చేసి చీరలను తయారుచేయించారు. అక్టోబర్ 9 నుండి పంపిణీ జరగనుంది. మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని ధూమ్ ధామ్ అనేలా చేస్తారు కేసీఆర్. కానీ ఈ యేడాది ఆ వీలు లేదు కాబట్టి ఇంటింటీకీ పంపిణీ చేయనున్నారు. దీని వలన రావాల్సిన స్థాయి పబ్లిసిటీ రాదు. పెద్దగా హడావుడి చేయలేరు. అందుకే కేటీఆర్ మాష్టర్ ప్లాన్ వేశారు. చీరలు పంపకం అయ్యే వరకు నిత్యం ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా వార్తల్లో నిలపాలని అనుకున్నారు.
మొదటగా కేటీఆర్ చీరల ఎగ్జిబిషన్ నిర్వహించి ప్రచారం స్టార్ట్ చేశారు. తెరాస అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. జనం సైతం చీరల పంపిణీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈలోపు సీన్లోకి రేవంత్ రెడ్డి ఎంటరయ్యారు. రాహుల్ గాంధీ మీద లాఠీఛార్జికి నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అది కాస్త బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ గొడవకు దారి తీసింది. మాటల యుద్దాలు, తోపులాటలు, పరస్పర దాడులు, రేవంత్ రెడ్డి ఆరెస్టులతో రాష్ట్రం మొత్తం అదే హాట్ టాపిక్ అయింది. పనిలో పనిగా ఏపీ, తెలంగాణల నడుమ నదీ జలాల విషయమై నిలదీస్తూ కేసీఆర్ కు లేఖ సంధించారు. దీంతో జనం దృష్టి బతుకమ్మ చీరల పంపిణీ నుండి ఈ గొడవల మీదకు మళ్లింది. ఇలా కేటీఆర్ పొందుదామనుకున్న ప్రచారానికి రేవంత్ రెడ్డి గండికొట్టినట్టు అయింది.