గతకడానికి  గంజి లేదు కానీ మీసాలకు సంపంగినూనె! 

Somu Veeraju
 
పూర్వం ఒక గ్రామంలో ఒక పేదబ్రాహ్మణుడు ఉండేవాడు.  యాచన చేస్తూ బతుకుతుండేవాడు.   పేదరికం కారణంగా అతనికి ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు.  ఒకరోజు ఒక మహాతల్లి ఆయనను శ్రావణశుక్రవారం రోజున భోజనానికి పిలిచి కమ్మని భోజనం పెట్టి  అతడు వెళ్లిపోతుండగా రాత్రికి తినడం కోసం కొంచెం పేలపిండిని చిన్న మట్టిముంతలో పెట్టి ఇచ్చింది.  
 
 
ఆ బ్రాహ్మణుడు రాత్రివేళకు ఒక సత్రంలో చేరి…మధ్యాహ్నభోజనం మరీ ఎక్కువగా చెయ్యడంతో భుక్తాయాసం తీరక పేలపిండి ముంతను కాళ్లదగ్గర పెట్టుకుని చేరగిలి పడుకుని పెళ్ళిగూర్చి ఆలోచిస్తూ డబ్బు ఎలా సంపాదించాలో పధకం వెయ్యసాగాడు.  “ఈరాత్రికి పేలపిండిని భుజించకుండా,  రేప్పొద్దున ఒక రూపాయికి అమ్మేసి,  గ్రామంలోకి వెళ్లి ఒక కోడిని కొంటాను.  ఆ కోడి రోజుకో గుడ్డు పెడుతుంది.  దాన్ని పావలాకు అమ్ముతాను.  నెలకు ఏడు రూపాయలు అవుతాయి.  ఆ డబ్బుతో ఒక మేకను కొంటాను.  కొన్నాళ్ళకు అది రెండు పిల్లలను ఈనుతుంది.  అవి పెద్దవై మరో నాలుగు పిల్లలను ఈనుతాయి.  ఆ తరువాత అన్నింటిని వందరూపాయలు అమ్మేసి రెండు పాడి ఆవులను కొంటాను.  ఆ పాలను అమ్ముతూ రోజూ వందరూపాయలు సంపాదిస్తాను.  నెలరోజుల్లో మూడువేల రూపాయలు అవుతాయి.  దాంతో అయిదు ఎకరాల స్థలం కొంటాను.  ఏడాది తరువాత నాలుగు ఎకరాలను అమ్మేసి లక్ష రూపాయలను సంపాదించి పదివేల రూపాయలతో ఒక భవనాన్ని నిర్మించుకుని దాసదాసీలను నియమించుకుంటాను.  అప్పుడు నాకు తమ కూతుళ్లను ఇవ్వడానికి కోటీశ్వరులు అందరూ పోటీ పడతారు.  చివరకు ఇద్దరు రంభ, ఊర్వశి లాంటి అందగత్తెలను ఎన్నుకుని పెళ్లిచేసుకుంటాను.  వారిద్దరూ నా పొందుకోసం తహతహలాడుతూ తన్నుకుంటారు.  నాకు పిచ్చకోపం వచ్చి ఇద్దరినీ ఫెడెల్ మని కాలుతో ఒక్క తన్ను తంతాను”  అని కాలును విసురుగా విదిలిస్తాడు.  ఆ తాపు ముంతకు తగిలి పేలపిండి మొత్తం నేలపాలవుతుంది.  
 
 
ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవికోసం అర్రులు చాస్తున్న  బీజేపీ ఒరిజినల్ నాయకుడు  సోము వీర్రాజు గారు ఎట్టకేలకు  ఆ పదవిని దక్కించుకున్నారు.  వెంటనే “రాబోయే ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు” అనే ఒక హాస్యాస్పదమైన ప్రకటన చేసేడు!   బీజేపీ ఇకమీదట కూడా జనసేనతో పొత్తు కొనసాగిస్తుందని, రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని ఒక సంకేతాన్ని ఆయన పంపించదలచుకుని ఉండొచ్చు….కానీ, ఆ ప్రకటనతో ఆయన మరోరకంగా ఇరుక్కునిపోయారు.  నిజానికి అలాంటి ప్రకటన చేసే అధికారం కేంద్ర నాయకత్వానిదే తప్ప రాష్ట్ర అధ్యక్షుడికి లేదు.  ఏ జాతీయపార్టీ రాష్ట్రశాఖ నాయకుడు కూడా ఇంతవరకూ అలా ప్రకటించిన దాఖలా లేదు.  
 
 
ఇక పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అప్పట్లో జనసైనికులు అందరూ తెగ ఊగిపోయారు.  పవన్ ఎక్కడ కనపడితే అక్కడ “సీఎం పవన్” అంటూ వెర్రికేకలు పెట్టి పెద్ద వినోదాన్ని కలిగించారు.  ఈ పిచ్చి అరుపులకు పవన్ కూడా ఒకింత వివశుడై “తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే”  “నేనెందుకు సీఎం కాకూడదు”  “జగన్ ఎలా సీఎం అవుతాడో చూస్తాను”  అంటూ మతిమాలిన ప్రకటనలు చేసి నవ్వులపాలయ్యాడు.  ఆ ఎన్నికల్లో జనసేనకు ఒకే ఒక సీట్ దక్కగా, అధ్యక్ష హోదాలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి దారుణంగా పరాభవించబడ్డాడు.  జనసేన టికెట్ మీద పోటీ చేసినవారిలో ఒకరిద్దరికి తప్ప ఎవ్వరికీ డిపాజిట్లు కూడా రాలేదు.  “పవన్ కళ్యాణ్ ఎలా ఎమ్మెల్యే అవుతాడో చూస్తాం” అని జనం ప్రతిజ్ఞ చేసినట్లు అయింది!  
 
 
ఇక బీజేపీ అప్పటివరకూ ఏడు శాతం ఓటు బ్యాంకుని కలిగిఉంది.  కన్నా లక్ష్మీనారాయణ గారి చంద్రబాబు బానిసత్వం, భజనలో మునిగిపోవడంతో బీజేపీకి గునపాలు కాల్చి అడ్డంగా, నిలువుగా వాతలు వేశారు ఓటర్లు.  సాక్షాత్తూ అధ్యక్షహోదాలో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణకు లభించిన ఓట్లు పదహారు వేల చిల్లర.  ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు.   బీజేపీ ఓటుబ్యాంక్ ఒకటికన్నా తక్కువ శాతానికి పడిపోయింది.    భవిష్యత్తులో  బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు కదా..కనీసం పంచాయితీ వార్డ్ మెంబర్ పదవి కూడా దక్కే ఛాన్స్ కూడా లేదు.  ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందనే ఆగ్రహం ఆంధ్రుల్లో రగిలిపోతుంది.  అది ఇప్పట్లో సమసిపోయేది కాదు.  
 
 
వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా “జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది” అన్నట్లు జనబలం లేని జనసేన, పేరులోనే జనతా తప్ప పార్టీలో జనత లేని  భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినా నిష్ప్రయోజనం.  బీజేపీకి ఒక పాతిక సీట్లు, జనసేనకు పది సీట్లు ఇప్పటికే ఉన్నట్లయితే…ఇంకా కష్టపడి పనిచేసి అధికారాన్ని సాధిస్తాం అని చెప్పుకున్నా ఒక అర్ధం ఉంటుంది.   ఈ రెండు పార్టీలకు  గ్రామస్థాయిలో కార్యకర్తలు లేరు..నాయకులు లేరు..ఓటర్లు లేరు…  కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టే రాష్ట్ర బీజేపీకి కాస్తో కూస్తో విలువ, కవరేజ్ దక్కుతున్నాయి.  లేకపోతే బీజేపీ అనే పార్టీ కూడా ఒకటి ఆంధ్రాలో ఉన్నదని ఎవరికీ తెలియకపోవును.  జనసేన తన అభిమానులు, కార్యకర్తల జుగుప్సాకరమైన భాష, హీనసంస్కారంతో ప్రజలతో అసహ్యించుకుని గెంటివేయబడిన విఫలప్రయోగం.  దానితో పొత్తు పెట్టుకుని  2024 లో అధికారాన్ని సాధిస్తాం అనుకోవడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం లాంటిది.  
 
వీర్రాజుగారికి ప్రజల్లో మంచి పేరుంది.  నిబద్ధత కలిగిన నాయకుడు అని ఆయన పట్ల గౌరవం కూడా ఉన్నది.  ఆయన మొదటిపేరాలో ప్రస్తావించబడిన పేదబ్రాహ్మణుడి మాదిరిగా దివస్వప్నాలలో మునిగిపోకుండా, పార్టీకి పది ఓట్లు తెచ్చేమార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు